
అంతరిక్ష ప్రయోగాల్లో మనకు తిరుగులేదు
‘గగన్‌యాన్’ మిషన్ వ్యోమగాముల ధీమా
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కిక స్వర్ణయుగమే శుభాంశు భవిష్యవాణి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. స్వదేశీ వ్యోమగాములను స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ రాకెట్‌లో అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2027లో ఈ మానవసహిత యాత్ర చేపట్టే అవకాశం ఉంది. అంతకంటే ముందు గగన్‌యాన్ యాత్ర(జీ1)లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌లో మానవరహిత టెస్టు ఫ్లైట్‌ను ప్రయోగించబోతున్నారు.
వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపిస్తారు. మానవసహిత యాత్రకు అవసరమైన సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరీక్షించడమే జీ1 యాత్ర ఉద్దేశం. మానవసహిత గగన్‌యాన్ యాత్రకు నలుగురు వ్యోమగాములు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఎంపికయ్యారు. ఇస్రో ఆధ్వర్యంలో వారికి ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది.
శుభాంశు శుక్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్)కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా నలుగురు వ్యోమగాములు శనివారం సమావేశమయ్యారు. తమ అనుభవాలు పంచుకున్నారు. ఐఎస్‌ఎస్ నుంచి మన భూమిని దర్శించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని శుభాంశు పేర్కొన్నారు. అది అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మానవులకు భూమి ఎంతో విలువైన గ్రహం అని అర్థమైందని చెప్పారు.
ఐఎస్‌ఎస్ యాత్ర తనకు అతిపెద్ద పాఠమని, ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గగన్‌యాన్ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక స్వర్ణయుగమని, ఇందులో తాను భాగస్వామి అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఒక వ్యోమగామి దృష్టి ఎల్లప్పుడూ సరిహద్దులకు అతీతంగా ఉంటుందని గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ అన్నారు.
అంతరిక్ష రంగంలో పనిచేసేవారు ఇతర గ్రహాలపై ఆవాసాలు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగాలు మన ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయన్నారు. గగన్‌యాన్ మిషన్ అనేది ఎన్నో ఇతర మిషన్ల సమ్మేళనం అని వివరించారు.
2047 నాటికి ఇండియా ‘స్పేస్ లీడర్’గా ఎదగడానికి ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. మరో 20 ఏళ్లలో మనం అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలపై అంగద్ ప్రతాప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇతర దేశాల్లో ఎన్నో పెద్ద అవకాశాలు వచ్చినప్పటికీ వదులుకొని మన దేశం కోసం వారు పని చేస్తున్నారని కొనియాడారు.
మానవ సహిత యాత్రల్లో ముందడుగు
అంతరిక్ష కార్యకలాపాలు ఏవైనా సరే అవి మన భూమికి, మనుషులకు లబ్ధి చేకూర్చేలా ఉండాలని అజిత్ కృష్ణన్ అభిప్రాయపడ్డారు. అలా లేకపోతే అవి వ్యర్థమేనని ఉద్ఘాటించారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో భారత్ ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ మరెన్నో గొప్ప విజయాలు సాధించడానికి స్పేస్ సైంటిస్టులు, వ్యోమగాములు కలిసికట్టుగా పని చేయాలన్నారు.
గత ఐదేళ్లలో ఎంతో సాధించామని, చంద్రుడిపైకి వెళ్లామని, డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేశామని గుర్తుచేశారు. స్పేస్ సెక్టార్‌లో ఎన్నో స్టార్టప్‌లు వస్తున్నాయని చెప్పారు. అంతరిక్షంలో మన పరుగులు చూసి ఇతర దేశాలు అసూయ చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. మన్ రోడ్‌మ్యాప్–2047 చాలా బలంగా ఉందన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో మనం ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదని బాలకృష్ణన్ నాయర్ పేర్కొన్నారు.