
హార్ట్ ఎటాక్ ఈ పేరు వింటే చాలు అందరి గుండెల్లో గుబులే. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఈ సమస్య మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ అందరినీ వేధిస్తోంది. కారణం ప్రస్తుత జనరేషన్ జీవనశైలి మార్పులే కారణం కావొచ్చు. తాజాగా హాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ డియోగో బోరెల్లా షూటింగ్ స్పాట్లోనే కన్నుమూశారు.
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఎమిలీ ఇన్ పారిస్ వెబ్ సిరీస్ ఐదో సీజన్కు డియోగో బోరెల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ ఇటలీలోని వెనిస్ నగరంలో జరుగుతోంది. ఈ ఘటన ఆగస్టు 21 గురువారం సాయంత్రం జరిగింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అతను కుప్పకూలిపోవడంతో సెట్‌లోని వైద్య సిబ్బంది బతికించడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ మృతితో షూటింగ్ను నిలిపేశారు. కాగా.. 'ఎమిలీ ఇన్ పారిస్' సీజన్ -5 డిసెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.