
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2025కు సమమయం దగ్గరపడుతోంది. ఈ ఆసియా సింహాల పోరు సెప్టెంబర్ 9నంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ప్రారంభం కానుంది. ఈ ఖండంతర టోర్నీ కోసం అన్ని జట్లు తమ సన్నహాకాలను ప్రారంభించాయి.
ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు, పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం వంటి సీనియర్ ప్లేయర్లు పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అయితే ఆసియాకప్ టీ20 ఫార్మాట్‌లో మాత్రం టీమిండియా చివరగా 2016లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఆసియాకప్ టోర్నీకి సంబంధించి అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది.
ఒక్కసారి కూడా..
41 సంవత్సరాల ఆసియాకప్ చరిత్రలో చిరకాల ప్రత్యర్ధిలు పాకిస్తాన్-భారత్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు. ప్రపంచ క్రికెట్‌లో రెండు గట్టి ప్రత్యర్థులుగా ఉన్న పాక్-భారత్ ఒక్కసారి కూడా సంయుక్తంగా ఫైనల్‌కు చేరలేకపోయాయి.
ఓవరాల్‌గా ఆసియాకప్ టోర్నీ(వన్డే, టీ20)లో దాయాదులు ఇప్పటివరకు ముఖాముఖి 18 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా పదింట విజయం సాధించగా.. పాక్ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. చివరగా రెండు జట్లు ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో తలపడ్డాయి. ఆసియాకప్-2023లో పాక్‌ను 228 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, శ్రీలంక జట్లు అత్యధికంగా 9 సార్లు తలపడ్డాయి.
కాగా ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్‌లో టైటిల్‌ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడాయి. ఇక ఈ ఏడాది ఖండాంత పోరులో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరగనుంది.
చదవండి: మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్