
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామన్యుల నుంచి సెలబ్రేటిల వరకు విరాట్ కోహ్లిని ఆరాధిస్తుంటారు. ఈ ఢిల్లీ బాయ్ ఎంతో మంది యువ క్రికెటర్లకు రోల్ మోడల్. ఈ జాబితాలో టీమిండియా లెజెండరీ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఉన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సూపర్‌స్టార్ విరాట్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవాలని ఆర్యవీర్ కలలు కంటున్నాడు. తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆర్యవీర్ మాత్రం ఆర్సీబీకి ఆడాలని తహతహలాడుతున్నాడు.
17 ఏళ్ల ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. డీపీఎల్ వేలంలో ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది టోర్నీలో ఇప్పటివరకు ఆడే అవకాశం అతడికి లభించలేదు. సెంట్రల్ ఢిల్లీ ఆటగాడు యశ్ ధుల్ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు వెళ్లనుండడంతో ఆర్యవీర్‌కు మిగితా మ్యాచ్‌ల్లో ఆర్యవీర్ భాగమయ్యే ఛాన్స్ ఉంది.
"ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లి గొప్ప బ్యాటర్. కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనేది నా కల. ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తాను. అదేవిధంగా మా నాన్న నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
ప్రతి ఒక్కరిని గౌరవించడం, అందరితో మర్యాదగా నడుచుకోవడం, కెరీర్ పరంగా ఎంత ఎదిగినా తగ్గే ఉండాలి మా నాన్న మాకు నేర్పించారు అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యవీర్ పేర్కొన్నాడు.
కాగా ఆర్యవీర్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
చదవండి: వాంఖెడే స్టేడియంలో గావస్కర్ విగ్రహావిష్కరణ