సెహ్వాగ్‌ ఆడినపుడు ఇలాంటి వాళ్లు లేరు: అభిషేక్‌ శర్మ | Abhishek Sharma Roasts Pakistan With Virender Sehwag Reference | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్‌ ఆడినపుడు ఇలాంటి వాళ్లు లేరు: అభిషేక్‌ శర్మ

Sep 23 2025 10:22 AM | Updated on Sep 23 2025 12:05 PM

Abhishek Sharma Roasts Pakistan With Virender Sehwag Reference

టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు తన సత్తా ఏమిటో మరోసారి చూపించాడు. ఆసియా కప్‌-2025 టోర్నీలో లీగ్‌ దశలో పాక్‌పై 13 బంతుల్లో 31 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. తాజాగా ఆదివారం నాటి సూపర్‌-4 మ్యాచ్‌లో మరోసారి దంచికొట్టాడు.

ధనాధన్‌ దంచికొట్టిన అభి.. పాక్‌ బౌలర్లు విలవిల 
దుబాయ్‌లో జరిగిన పాక్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. పాక్‌ పేసర్లు షాహిన్‌ ఆఫ్రిది (Shaheen Afridi), హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ చితక్కొట్టాడు. అయితే, స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ (Abrar Ahmed) బౌలింగ్‌లో హ్యారిస్‌ రవూఫ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అభిషేక్‌ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఏదేమైనా షాహిన్‌, రవూఫ్‌ల బౌలింగ్‌లో అభిషేక్‌ ధనాధన్‌ దంచికొట్టిన తీరు అభిమానులకు మజా ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇక అభిషేక్‌కు తోడు మరో ఓపెనర్‌ , వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 47), నాలుగో నంబర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (19 బంతుల్లో 47) రాణించడంతో.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే.. పాక్‌ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది.

వీరూ పాజీ హిట్టింగ్‌ ఆడిన రోజుల్లో
ఈ నేపథ్యంలో విజయానంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ ఆసియా కప్‌ బ్రాడ్‌కాస్టర్‌ సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ఈ క్రమంలో పాక్‌ జట్టు బౌలర్ల గురించి మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘వీరూ పాజీ హిట్టింగ్‌ ఆడిన రోజుల్లో పాక్‌ బౌలర్లు గట్టి పోటీనిచ్చేవారు. కానీ ప్రస్తుత జట్టులో అలాంటి బౌలర్లు ఎవరూ లేరు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుత పాక్‌ బౌలింగ్‌ దళం బలహీనంగా ఉందని అభిషేక్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. కాగా సెహ్వాగ్‌ టీమిండియాకు ఆడిన సమయంలో షోయబ్‌ అక్తర్‌ వంటి మేటి బౌలర్లు పాక్‌ జట్టులో ఉండేవారన్న సంగతి తెలిసిందే.

సెంచరీ చేయాల్సింది
ఇదిలా ఉంటే.. అభిషేక్‌ శర్మ పాక్‌తో మ్యాచ్‌లో సెంచరీ మిస్‌ కావడం తనకు కాస్త వెలితిగా అనిపించిందని ఈ సందర్భంగా సెహ్వాగ్‌ అన్నాడు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయని.. 50s, 70s లను శతకాలుగా మార్చాలని ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌కు సెహ్వాగ్‌ సూచించాడు.

‘‘నువ్వు 70 పరుగులు దాటావంటే.. 100 చేసేందుకు కచ్చితంగా ప్రయత్నించు. సునిల్‌ గావస్కర్‌ నాకో మాట చెప్పారు. ‘నువ్వు రిటైర్‌ అయినపుడు ఈ 70, 80 స్కోర్లు నీకు గుర్తుకువస్తాయి. ఆరోజే వాటిని సెంచరీలుగా మలిస్తే బాగుండదని అనిపిస్తుంది’ అన్నారు.

ఎందుకంటే వందకు చేరువయ్యే అవకాశం మళ్లీ మళ్లీ రాదు కదా!.. అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన రోజు నాటౌట్‌గా ఉండేందుకు నువ్వు ప్రయత్నించు’’ అని సెహ్వాగ్‌ అభిషేక్‌ శర్మతో అన్నాడు.

చదవండి: ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్‌ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement