
టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma)పై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తిలక్ వర్మ వల్లే టీమిండియా భారీ స్కోరు చేసిందని పేర్కొన్నాడు. అదే విధంగా.. సంజూ శాంసన్ ఆట తీరును కూడా సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రశంసించాడు.
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. సూపర్-4లో చివరిగా నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
అభిషేక్‌తో పాటు ఆ ఇద్దరు
ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ (31 బంతుల్లో 61) ఆడగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) (4) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (2) కూడా పూర్తిగా నిరాశపరిచారు.
అయితే, నాలుగో నంబర్ బ్యాటర్.. తిలక్ వర్మ, ఐదో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ బ్యాట్ ఝులిపించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తిలక్ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 49 పరుగులతో అజేయంగా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
Tilak Varma showing us the art of the “𝐠𝐡𝐮𝐭𝐧𝐚 𝐭𝐞𝐤 𝐜𝐡𝐡𝐚𝐤𝐤𝐚” 🤌
Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/uLCfH4YepT— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025
తిలక్ వర్మ వల్లే ఇలా..
ఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ తిలక్ వర్మ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ కాకుండా.. ఇంకా ఎవరైనా రాణించాలని, పరుగులు రాబట్టాలని టోర్నీ ఆరంభం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాం.
ఈరోజు తిలక్ వర్మ.. సంజూ శాంసన్ ఆ పని చేశారు. వారిద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవచ్చు. కానీ ఇద్దరూ అద్భుతమైన, జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి వల్లే టీమిండియా 200 పరుగుల మార్కు అందుకుంది.
ముఖ్యంగా తిలక్ వర్మ ఆఖరి వరకు అజేయంగా ఉండటం కలిసి వచ్చింది. ఇలా ఓ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆసాంతం నాటౌట్‌గా ఉన్నాడంటే.. అతడు తప్పక భారీ స్కోరు చేయగలడనే నమ్మకం వస్తుంది.
ఫైనల్‌కు ముందు ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం
ఫైనల్‌కు ముందు తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇలా బ్యాట్ ఝులిపించడం సానుకూలాంశం. వీరిద్దరి వల్ల టైటిల్ పోరులో భారత జట్టుకు తప్పక ప్రయోజనం చేకూరుతుంది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
కాగా 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. టీమిండియా మాదిరే ఐదు వికెట్లు కోల్పోయి సరిగ్గా 202 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో భారత్ విజయఢంకా మోగించింది. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ఆసియా కప్ తాజా ఎడిషన్‌లో లెఫ్టాండర్ బ్యాటర్ తిలక్ వర్మ ఐదు ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు.
మరోవైపు.. సంజూ మూడు ఇన్నింగ్స్‌లో 108 పరుగులు రాబట్టాడు. ఇక ఆదివారం నాటి ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా.. దాయాది పాకిస్తాన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.
చదవండి: Asia Cup 2025: పాక్‌తో ఫైనల్‌కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు