
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మతో పాటు.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు సమాచారం. సూపర్-4 దశలో ఆఖరిగా టీమిండియా శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే.
ఒకే ఒక్క ఓవర్ వేసి
దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఏడు పరుగులు ఇచ్చి.. కుశాల్ మెండిస్ (0) రూపంలో కీలక వికెట్ తీశాడు. అయితే, ఆ తర్వాత హార్దిక్ మళ్లీ బౌలింగ్‌కు రానేలేదు. అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
ఫీల్డింగ్‌కు రాని అభిషేక్
మరోవైపు.. మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) కూడా శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా పూర్తిస్థాయిలో ఫీల్డింగ్‌కు అందుబాటులో ఉండలేదు. దీంతో టీమిండియా అభిమానుల్లో కలవరం నెలకొంది. కాగా లంకపై సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించిన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు.
అప్పుడే ఫిట్‌నెస్‌పై అంచనాకు వస్తాం
ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గురించి ప్రస్తావన రాగా.. ‘‘హార్దిక్ కండరాలు పట్టేశాయి. శుక్రవారం రాత్రి.. శనివారం ఉదయం పరీక్షించిన తర్వాత అతడి ఫిట్‌నెస్‌పై అంచనాకు వస్తాము. ఆ తర్వాతే అతడి గురించి నిర్ణయం తీసుకుంటాం.
ఇక అభిషేక్ శర్మ కూడా కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయితే, తను బాగానే ఉన్నాడు. ఇప్పటికైతే గాయం పెద్దదేమీ కాదు’’అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేకుంటే మాత్రం టీమిండియాకు తలనొప్పి తప్పదు.
ఇద్దరూ అత్యంత కీలకం
ఇప్పటి వరకు ఆసియా కప్-2025 టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా టాపార్డర్‌లో అత్యంత కీలకం. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టడంలో హార్దిక్ పాండ్యా దిట్ట.
ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా రాణించిన రికార్డు పాండ్యాకు ఉంది. కాగా లీగ్, సూపర్-4 దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆదివారం (సెప్టెంబరు 28) నాటి ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ టైటిల్ పోరుకు దుబాయ్ వేదిక.
చదవండి: సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య