
చివరి మ్యాచ్‌లో స్కోర్లు సమం
సూపర్ ఓవర్‌లో ఓడిన శ్రీలంక
నిసాంక సెంచరీ వృథా
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో లీగ్‌తో పాటు ‘సూపర్–4’ దశను భారత్ అజేయంగా ముగించింది. శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ‘సూపర్ ఓవర్’లో శ్రీలంకపై విజయం సాధించింది. సూపర్ ఓవర్లో 5 బంతులు ఆడిన లంక 2 పరుగులకే పరిమితం కాగా... భారత్ తొలి బంతికే 3 పరుగులు సాధించి గెలిచింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ టైటిల్ కోసం తలపడనుంది.
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టోర్నీలో వరుసగా మూడో అర్ధ సెంచరీ నమోదు చేసిన అభిషేక్ ఈసారి గత మ్యాచ్‌లకంటే వేగంగా 22 బంతుల్లోనే ఆ మార్క్‌ను అందుకోవడం విశేషం.
మిడిలార్డర్‌లో తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సంజు సామ్సన్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా కీలక పరుగులు సాధించడంతో జట్టు భారీ స్కోరు నమోదు చేయగలిగింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 66 పరుగులు జోడించారు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. పతుమ్ నిసాంక (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో సత్తా చాటగా, కుషాల్ పెరీరా (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
వీరిద్దరు రెండో వికెట్‌కు 70 బంతుల్లోనే 127 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేపారు. అయితే చివర్లో భారత బౌలర్లు కట్టడి చేయడంతో లంక విజయలక్ష్యం చేరలేకపోయింది. ఛేదనలో తొలి ఓవర్లోనే కుశాల్ మెండిస్ (0) అవుటైనా...నిసాంక, పెరీరా కలిసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను నడిపించారు. భారత బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా 10 ఓవర్లలో జట్టు స్కోరు 114 పరుగులకు చేరింది.
అయితే గెలుపు దిశగా సాగుతున్న సమయంలో తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. నిసాంక పోరాడినా...జట్టును గెలుపుతీరం చేర్చడంలో విఫలమయ్యాడు. హర్షిత్ వేసిన ఆఖరి ఓవర్లో లంక విజయానికి 12 పరుగులు అవసరం కాగా...11 పరుగులే వచ్చాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా, శివమ్ దూబేలకు విశ్రాంతినిచ్చిన భారత్ తుది జట్టులో అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు కల్పించింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) కమిందు (బి) అసలంక 61; గిల్ (సి అండ్ బి) తీక్షణ 4; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) హసరంగ 12; తిలక్ వర్మ (నాటౌట్) 49; సామ్సన్ (సి) అసలంక (బి) షనక 39; పాండ్యా (సి) అండ్ (బి) చమీరా 2; అక్షర్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 202. వికెట్ల పతనం: 1–15, 2–74, 3–92, 4–158, 5–162. బౌలింగ్: తుషార 4–0–43–0, తీక్షణ 4–0–36–1, చమీరా 4–0–40–1, హసరంగ 4–0–37–1, షనక 2–0–23–1, అసలంక 2–0–18–1.
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) వరుణ్ (బి) హర్షిత్ 107; కుశాల్ మెండిస్ (సి) గిల్ (బి) పాండ్యా 0; కుషాల్ పెరీరా (స్టంప్డ్) సామ్సన్ (బి) వరుణ్ 58; అసలంక (సి) గిల్ (బి) కుల్దీప్ 5; కమిందు (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 3; షనక (నాటౌట్) 22; లియనాగె (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–7, 2–134, 3–157, 4–163, 5–191. బౌలింగ్: పాండ్యా 1–0–7–1, అర్ష్ దీప్ 4–0–46–1, హర్షిత్ 4–0–54–1, అక్షర్ 3–0–32–0, కుల్దీప్ 4–0–31–1, వరుణ్ 4–0–31–1.