
కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో జైస్వాల్
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)పై భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో జైసూ శతక్కొట్టిన తీరు అద్భుతమని కొనియాడాడు. చాలా మంది జైసూను.. విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)తో పోలుస్తారన్న ఆకాశ్ చోప్రా.. అది నిజం కాదన్నాడు.
ఏడో సెంచరీ
సెంచరీతో తన టెస్టు అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్న జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆరు సెంచరీలు బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా శుక్రవారం ఏడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపికగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించుకున్న ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి.. 253 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 173 పరుగులు చేశాడు.
మొదటి బంతి నుంచే హిట్టింగ్
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘చాలా మంది జైస్వాల్‌ను తరచూ వీరేందర్ సెహ్వాగ్‌తో పోలుస్తూ ఉంటారు. కానీ అతడు సెహ్వాగ్ కంటే భిన్నమైన ప్లేయర్.
వచ్చామా.. మొదటి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలి అన్నట్లుగా సెహ్వాగ్ అప్రోచ్ ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలపై దూకుడు ప్రదర్శిస్తూ కుదిరితే లంచ్‌లోపే సెంచరీ కొట్టేయాలని వీరూ భావించేవాడు.
జైస్వాల్ అలా కాదు
కానీ జైస్వాల్ అలా కాదు. అతడి మైండ్‌సైట్ సెహ్వాగ్ కంటే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం టెస్టుల్లో మాత్రమే అతడికి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడంపైనే అతడి దృష్టి ఉంది.
పిచ్ ఒకవేళ బాగుంటే.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా ఉన్నా.. నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించడం మొదలుపెడతాడు. ఓపికగా ఆడుతూ.. అవసరమైనపుడు మాత్రమే షాట్లు బాదుతూ అనుకున్న పనిని పూర్తి చేస్తాడు.
ప్రతి బంతిని షాట్ బాదాలన్న ఇగో ఏమాత్రం లేదు. భోజనానికి ముందు ఓపికగా ఆడిన జైసూ.. ఆ తర్వాత అటాకింగ్ మొదలుపెట్టాడు. ప్రత్యర్థిని బెంబెలెత్తించి భారీ శతకం సాధించాడు’’ అని ఆకాశ్ చోప్రా జైస్వాల్‌ను ప్రశంసించాడు.
రనౌట్
కాగా తొలిరోజు అదరగొట్టిన జైస్వాల్.. శనివారం రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన ఈ 23 ఏళ్ల బ్యాటర్.. డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక శనివారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు చేసింది.
చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!