
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారీ శతకంతో కదంతొక్కిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శనివారం నాటి రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. ద్విశతకానికి పాతిక పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా భారత్- వెస్టిండీస్ (IND vs WI) మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది.
తొలిరోజు భారత్‌దే
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ భారీ శతకం బాదాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan- 87) రాణించాడు.
జైసూ డబుల్ సెంచరీ మిస్
ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక శనివారం ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించిన జైస్వాల్ తన తొందరపాటు చర్యతో రనౌట్ అయ్యాడు.
గిల్ తప్పా?
టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో విండీస్ పేసర్ జేడన్ సీల్స్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో రెండో బంతికి మిడాఫ్ దిశగా జైసూ బాదిన బంతి నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, ఇంతలోనే జైస్వాల్ పరుగు కోసం క్రీజు వీడగా.. గిల్ మాత్రం పరిస్థితికి తగ్గట్టుగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోనే ఉండిపోయాడు.
Yashasvi Jaiswal (runout) seems to have developed a habit of taking off for a run even when the ball goes straight to the fielder. He really needs to learn from this —
When you're on a big score, what's the rush for a single? 🤦♂️pic.twitter.com/asdamXT1zj— Sporttify (@sporttify) October 11, 2025
తల బాదుకున్న జైసూ
దీంతో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా.. అప్పటికే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ దానిని వికెట్లకు గిరాటేశాడు. ఫలితంగా తన ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం రెండు పరుగులు జతచేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన జైసూ.. కోపంలో తలబాదుకుంటూ క్రీజును వీడాడు.
తప్పు నీదే
ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతుండగా.. కొంతమంది గిల్‌ను తప్పుబడుతున్నారు. అయితే, చాలా మంది మాత్రం.. ‘బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినా తొందరపడి పరుగుకు రావడం జైసూ తప్పు. అతడికి ఇదొక అలవాటుగా మారింది. 175 పరుగులు చేసిన నీకు ఈ రిస్కీ సింగిల్ అవసరమా? ఇది నీ స్వీయ తప్పిదం’’ అంటూ జైస్వాల్‌ను విమర్శిస్తున్నారు.
కాగా జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 258 బంతులు ఎదుర్కొని 22 ఫోర్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. వంద ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని!