
భారత్ నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెలాఖరులో అమల్లోకి రానున్న అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో మార్పులను ఉటంకిస్తూ ఆగస్టు 25 నుంచి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ తాజాగా ప్రకటించింది. అనేక వస్తువులపై సుంకం మినహాయింపును అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూలై 30న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నం.14324 ద్వారా 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు డ్యూటీ-ఫ్రీ మినహాయింపు తొలగించారు. ట్రంప్ ఇటీవల భారత్‌పై 25 శాతం సుంకం విధించడంతో పాటు రష్యా చమురు కొనుగోలుకు అదనంగా 25 శాతం జరిమానా విధించడంతో మొత్తం టారిఫ్ భారం 50 శాతానికి పెరిగింది. ఈ పరిణామాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి పోస్టల్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 29 నుంచి అమెరికాకు తరలించే అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులు వాటి విలువతో సంబంధం లేకుండా, దేశ-నిర్దిష్ట అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తి చట్టం (ఐఈఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉంటాయని తపాలా శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అయితే 100 డాలర్ల వరకు విలువైన గిఫ్ట్ ఐటమ్స్ కు మాత్రం మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది.
ఎయిర్ క్యారియర్లు తమకు అవసరమైన విధానాలు లేకపోవడంతో ఆగస్టు 25 తర్వాత పార్సిళ్లు తీసుకోలేమని భారత అధికారులకు తెలియజేశారు. దీంతో భారత పోస్టల్ శాఖ ఇప్పుడు లెటర్లు/డాక్యుమెంట్లు, 100 డాలర్ల వరకూ విలువైన గిఫ్ట్ ఐటెమ్స్ మాత్రమే స్వీకరిస్తుంది. ఇప్పటికే బుక్ చేసిన బట్వాడాకు వీలులేని వస్తువులకు రిఫండ్ పొందవచ్చని పోస్టల్ శాఖ తెలియజేసింది.