
అమెరికాలో భారతీయ తినుబండారాలు, నిత్యావసర సరుకుల ధరలు అక్కడి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్‌లో తక్కువ ధరకు లభించే అవే వస్తువులు అమెరికాలో పదుల రెట్లు అధికంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. ఓ స్టోర్‌లో ఏ వస్తువుల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తూ ఓ భారతీయ యువకుడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న ఓ వాల్‌మార్ట్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న భారతీయ ఆహార ఉత్పత్తులను, వాటి ధరలను చూపిస్తూ రజత్ అనే ఓ భారతీయుడు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. రాయల్ లెంటిల్స్, హల్దీరామ్ స్నాక్స్, పార్లే బిస్కెట్లు, వివిధ మసాలా దినుసులు, సాస్‌లు వంటి ప్రసిద్ధ వస్తువుల రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో రజత్ వివరించారు.
డల్లాస్‌లో భారతీయులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. అందుకే ఆ స్టోర్‌లో భారతీయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచుతారని రజత్ చెప్పారు. పప్పు, నామ్కీన్, బిస్కెట్ల వంటి వస్తువుల ధరలు 4 డాలర్ల నుండి 4.5 డాలర్ల వరకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వీడియో చూసిన యూజర్లు వస్తువుల ధరలు చూసి నోరెళ్లబెట్టారు. ఇండియాలో వాటి ధరలు.. అమెరికాలోని ఆ స్టోర్‌లో వాటి రేట్లు తెలుసుకుని వామ్మో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. ఓ యూజరైతే ‘హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు 4 డాలర్లా? అంటే రూ.320. అది ఇండియాలో రూ.20 లకే వస్తుంది’ అంటూ కామెంట్ చేశారు.