
అనిల్ అంబానీ సహాయకుడు.. రిలయన్స్ పవర్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అయిన 'అశోక్ కుమార్ పాల్'ను ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసుకు సంబంధించి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
రిలయన్స్ పవర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్న అశోక్ పాల్‌కు.. రూ. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనే ఆయనను ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించిన ఈడీ.. గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు, శనివారం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కోరనున్నట్లు సమాచారం.
చార్టర్డ్ అకౌంటెంట్ అయిన పాల్.. 2023 జనవరి 29న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమితులయ్యారు. ఆయనకు సుమారు ఏడు సంవత్సరాలకు పైగా రిలయన్స్ పవర్‌తో అనుబంధం ఉంది. అయితే భువనేశ్వర్, కోల్‌కతాతో సహా పలు ప్రాంతాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సోదాలు ప్రారంభించిన చాలా రోజుల తరువాత ఈ అరెస్టు చేయడం జరిగింది.
ఏమిటి ఈడీ కేసు
రిలయన్స్ పవర్‌తో పాటు.. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపైన రూ. 17వేల కోట్ల బ్యాంకు లోన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఆగస్టులో ముంబైలోని 35 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన తర్వాత ED దర్యాప్తు చేపట్టింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం.. కింద 50 కంపెనీలు, గ్రూప్‌తో సంబంధం ఉన్న 25 మంది వ్యక్తులను కవర్ చేసింది. తాజాగా సీఎఫ్ఓ అరెస్ట్ కేసులో మరింత కీలకంగా మారిందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా..