
న్యూఢిల్లీ: అమెరికా కస్టమ్స్ శాఖ తాజాగా ప్రకటించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది. 100 డాలర్లకంటే ఎక్కువ విలువైన బహుమతులను అమెరికా భూభాగంలోకి డెలివరీ చేసేందుకు తొలుత ఇండియాపోస్ట్ తాత్కాలిక విరామం ఇవ్వగా తాజాగా అన్ని కేటగిరీల పార్శిళ్లను అమెరికాకు డెలివరీ చేయడం ఆపేసింది. ‘‘ఆగస్ట్ 22న జారీచేసిన బహిరంగ నోటీస్ ప్రకారమే అమెరికాకు పార్శిళ్ల డెలివరీను ఆపేశాం.
అయితే అమెరికా కస్టమ్స్ శాఖ విడుదలచేసిన తాజా నిబంధనల్లో స్పష్టత కొరవడింది. ఇలాంటి అస్పష్ట పరిస్థితుల్లో అమెరికాకు లేఖలు, డాక్యుమెంట్లు, బహుమతుల వంటి ఎలాంటి వస్తువులను పంపడం సమర్థనీయం కాదు. అందుకే అన్నిరకాల పార్శిళ్లను అమెరికాకు పంపడం నిలిపేస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అమెరికా విభాగాల స్పందనకు అనుగుణంగా వీలైనంత వరకు త్వరగా సేవల పునరుద్ధరణకు కట్టుబడిఉన్నాం’’అని ఇండియాపోస్ట్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.