
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచి 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ఇండియన్ ప్రీమియల్ లీగ్ మెగా వేలం నుంచే ఆర్సీబీ ఆచితూచి అడుగులు వేసింది. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. అదే సమయంలో గ్లెన్ మాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లను వదులుకుంది. ఏడేళ్ల పాటు తమ జట్టులో ఉన్న సిరాజ్‌ను ఎందుకు వదులుకోవాల్సిందో ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ తాజాగా వెల్లడించారు.
'భారత అంతర్జాతీయ బౌలర్లను దక్కించుకోవడం అంత సులభం కాదు. సిరాజ్‌ను జట్టులో ఉంచుకోవాలా, విడుదల చేయాలా లేదా రైట్ టు మ్యాచ్ ఉపయోగించాలా అని ఆలోచించాం. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని మేము అతనితో చర్చించాం. అయితే అది నేరుగా కాదు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగల భువీని జట్టులోకి తీసుకోవాలని గట్టిగా ప్రయత్నించాం. దీంతో సిరాజ్‌ను కొనసాగించడం కుదరదని అర్థమైంది. ఇదొక్కటే కాదు, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. సిరాజ్ గురించే ఎక్కువగా చర్చించామ'ని క్రిక్‌బజ్‌తో మో బోబాట్ చెప్పారు. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను గాయం కారణంగా మాత్రమే నిలుపుకోలేదని వెల్లడించారు. అతడు ఫిట్‌గా ఉంటే తమతో పాటు కొనసాగించేవాళ్లమని తెలిపారు.
సిరాజ్‌కు రూ.12.25 కోట్లు
ఐపీఎల్‌లో మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఆర్సీబీ తరపున 102 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో హాజిల్‌వుడ్‌ను రూ.12.50 కోట్లకు, భువనేశ్వర్‌ను రూ.10.75 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. రూ.12.25 కోట్లకు సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్‌కు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్ తరఫున సిరాజ్ 15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ తరపున 14 మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ 17 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్ 12 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లతో టాప్‌లో నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్న సంగతి తెలిసిందే.
సిరాజ్‌పై ప్రశంసలు
మరోవైపు ఇటీవల ఇంగ్లండ్‌లో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించి సిరాజ్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా సమం చేయడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించడంతో అతడి పేరు మీడియాలో మార్మోగిపోయింది.