టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) అర్ధ శతకంతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పూర్తిగా విఫలమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన 26వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైంది. కోల్‌కతాలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో రాణించి.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.
31, 39.. తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్లు ఇవే
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో సఫారీ టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. బవుమా పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు.
అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులే చేసింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగులో క్రీజులో నిలిచారు.
జోడీని విడదీసిన బుమ్రా
ఈ క్రమంలో 93/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికా కాసేపటికే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బవుమాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసిన టెయిలెండర్ బాష్‌ను బుమ్రా అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. బవుమా- బాష్ (25) జోడీని విడదీసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్
అయితే, బవుమా మాత్రం జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ బాది.. 122 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రొటిస్ ఇన్నింగ్స్ 54వ ఓవర్ మూడో బంతికి సిరాజ్ సైమన్ హార్మర్ (20 బంతుల్లో 7)ను బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
సఫారీ జట్టు ఆలౌట్
అదే ఓవర్లో ఆఖరి బంతికి సిరాజ్ మియా కేశవ్ మహరాజ్ (0)ను పదో వికెట్‌గా వెనక్కి పంపడంతో సఫారీ జట్టు ఆలౌట్ అయింది. మొత్తంగా 54 ఓవర్ల ఆటలో 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో 123 పరుగుల ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా.. టీమిండియాకు 124 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. దీంతో టార్గెట్ 124 (153-30=123) పరుగులుగా మారింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. మూడోరోజు బుమ్రా ఒక వికెట్ పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.


