టీమిండియా పేస్ దళంలో ప్రధాన బౌలర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మొహమ్మద్ సిరాజ్ కొనసాగుతున్నారు. వీరికి తోడుగా యువ పేసర్లు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ వరుస మ్యాచ్‌లలో అవకాశాలు దక్కించుకుంటున్నారు.
పేస్ ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదటి ప్రాధాన్య ఆటగాడిగా ఉండగా.. టెస్టుల్లో నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక వన్డేల్లో ఆడే అవకాశం వస్తున్నా.. గత రెండేళ్లుగా మొహమ్మద్ షమీ టెస్టులకు దూరమైపోయాడు.
షమీకి బైబై
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలకూ షమీని ఎంపిక చేయని సెలక్టర్లు.. రంజీల్లో సత్తా చాటుతున్నా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టుల్లోనూ మొండిచేయి చూపారు.
వీరి సంగతి ఇలా ఉంటే.. స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ 2022, నవంబరులోనే టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్నా సెలక్టర్లు అతడిని కనికరించలేదు.
అయితే, టీమిండియాకు దూరమైనా ఐపీఎల్‌లో మాత్రం భువీ సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన ఈ యూపీ రైటార్మ్ పేసర్.. ఆర్సీబీ తమ తొలి టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026 మినీ వేలానికి సమయం సమీపిస్తున్న విషయం తెలిసిందే.
భువీకి అన్యాయం
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ భువీకి అన్యాయం చేసిందని.. ఇంతవరకు అతడికి సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేకపోయిందని విమర్శించాడు. ఈ మేరకు..
‘‘భారత జట్టులో భువీని సరైన విధంగా ట్రీట్ చేయలేదని నా అభిప్రాయం. ముందుగానే అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు చూడండి.. అతడు ఆర్సీబీ తరఫున ఈ ఏడాది టైటిల్ గెలిచాడు. భువీ ఫిట్‌నెస్ గురించి చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తారు.
భర్తీ చేయగల సరైన బౌలర్ లేడు
ఫాస్ట్‌బౌలర్ అన్నాక కెరీర్‌లో ఏదో ఒక సమయంలో గాయాల బెడద తప్పదు. అలాంటపుడే యాజమాన్యం నుంచి సరైన మద్దతు ఉండాలి. కానీ వాళ్లు భువీని కాదనుకుని ముందుకు సాగిపోయారు. ఇప్పటికీ టీమిండియాలో అతడి స్థానాన్ని భర్తీ చేయగల సరైన బౌలర్ లేడు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
ఒకవేళ భువీని మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు ఎంపిక చేస్తే.. అతడు తప్పక రాణిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు. ఫిట్‌నెస్ దృష్ట్యా టెస్టులకు దూరంగా ఉన్నా.. యాభై, ఇరవై ఓవర్ల క్రికెట్‌లో రాణించడం ఇందుకు నిదర్శనమని అన్నాడు.
ఏదేమైనా భువీ ఇప్పట్లో ఐపీఎల్ నుంచి మాత్రం రిటైర్ కాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌లో ఇప్పటికి 190 ఇన్నింగ్స్‌లో 198 వికెట్లు తీసిన 35 ఏళ్ల భువీ.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


