సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అతడికి తోడుగా మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), అక్షర్ పటేల్ రాణించడంతో ప్రొటిస్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.
టాస్ గెలిచిన సౌతాఫ్రికా
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC )సీజన్‌లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆరంభం నుంచే విజృంభించి
బుమ్రా ఆరంభం నుంచే బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) వికెట్లు తీసి ఆదిలోనే సఫారీలకు షాకిచ్చాడు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సౌతాఫ్రికా వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ (24)తో పాటు కెప్టెన్ తెంబా బవుమా (3) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?
ఆ తర్వాత బుమ్రా మరోసారి తన పేస్ పదునుతో టోనీ డి జోర్జి (24)ని బౌల్డ్ చేయగా.. వికెట్ కీపర్ వెరెన్నె (16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సిరాజ్.. మార్కో యాన్సెన్ (0)ను డకౌట్ చేశాడు. ఇక స్పిన్నర్ అక్షర్ పటేల్.. కార్బిన్ బాష్ (3)ను ఎల్బీడబ్ల్యూ చేసి ఒక వికెట్ దక్కించుకోగా.. సైమన్ హార్మర్ (5)ను తొమ్మిదో వికెట్‌గా బుమ్రా వెనక్కి పంపాడు.
ఆ తర్వాత కేశవ్ మహరాజ్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన బుమ్రా.. ఐదు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేసుకుని... సౌతాఫ్రికా కథను ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు తుది జట్లు
భారత్
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా
ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్ని (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్
చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్‌పై కుంబ్లే ఫైర్


