కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను జట్టు నుంచి తప్పించడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో సుదర్శన్ విఫలమైనప్పటికి.. స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో మాత్రం సత్తాచాటాడు.
దీంతో సౌతాఫ్రికా సిరీస్‌లో కూడా అతడు ఆడడం ఖాయమని అంతా భావించారు. కానీ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడిని బెంచ్‌కు పరిమితం చేశాడు. మూడో స్ధానంలో సుదర్శన్‌కు బదులుగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌కు పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో భారత్ ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు (జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్)తో బరిలోకి దిగింది.
ఈ నేపథ్యంలో గంభీర్‌పై భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఖచ్చితంగా ఆడుతాడని అనుకున్నాను. కానీ అతడిని పక్కన పెట్టారు. ఇప్పుడు నంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారు?
వాషింగ్టన్ సుందర్ నంబర్ 3లో ఆడుతాడా? అస్సలు మీ ప్రణాళిక ఎంటో ఆర్ధం కావడం లేదు. నలుగురు స్పిన్నర్లు, కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ఆడడం ఏంటి? తొలి రోజు బ్యాటింగ్‌కు కోల్‌కతా వికెట్ బాగుంది. కాబట్టి నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. కచ్చితంగా నలుగురులో ఎవరో ఒకరు తక్కువ ఓవర్లకే పరిమితమవుతారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకు ఉన్న అప్షన్స్‌ను ఎలా ఉపయోగిస్తాడో వేచి చూడాలి అని సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


