ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌: గిల్‌ను బతిమిలాడిన సిరాజ్‌.. కట్‌ చేస్తే.. | Bas Ek Over De De: How Siraj Request To Gill Changed Things IND vs SA Day1 | Sakshi
Sakshi News home page

ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌: గిల్‌ను బతిమిలాడిన సిరాజ్‌.. కట్‌ చేస్తే..

Nov 15 2025 2:50 PM | Updated on Nov 15 2025 3:10 PM

Bas Ek Over De De: How Siraj Request To Gill Changed Things IND vs SA Day1

టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం ఇందుకు వేదిక.

రాణించిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. భారత్‌.. సఫారీలను తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్‌ చేసి సత్తా చాటింది. టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) చెరో రెండు.. అక్షర్‌ పటేల్‌ (Axar Patel) ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

అయితే, బుమ్రా ఆది నుంచే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో అప్పటికే 43 పరుగులు ఇచ్చేసిన సిరాజ్‌ మియా చేతికి ఆ తర్వాత బంతి రావడానికి చాలా సమయమే పట్టింది.

ఒకే ఓవర్లో రెండు
ఎట్టకేలకు తను వేసిన పదో ఓవర్లో సిరాజ్‌ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. తొలి బంతికి కైల్‌ వెరెన్నె(16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి మార్కో యాన్సెన్‌(0)ను బౌల్డ్‌ చేసి తన ఖాతాలో రెండో వికెట్‌ జమచేసుకున్నాడు.

ప్లీజ్‌.. ఒక్క ఓవర్‌ వేసే అవకాశం ఇవ్వు
ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట తర్వాత సిరాజ్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లీజ్‌.. ఒక్క ఓవర్‌ వేసే అవకాశం ఇవ్వు అని గిల్‌ను అడిగాను. అదే ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు తీశాను’’ అని సిరాజ్‌ తెలిపాడు.

అదే విధంగా బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వికెట్‌ తీయడానికి నేను ఇబ్బంది పడుతున్న సమయంలో జస్సీ భాయ్‌ వచ్చి.. స్టంప్స్‌ మీదకు బౌల్‌ చేయమని చెప్పాడు. ఎల్బీడబ్ల్యూ కోసం ట్రై చేయమన్నాడు. 

బౌల్డ్‌ చేయడం.. క్యాచ్‌లు పట్టడం.. ఇలా వికెట్‌ తీయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయని.. నన్ను కేవలం బౌలింగ్‌ మీద మాత్రమే దృష్టి పెట్టమని చెప్పాడు’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు. తాను నిరాశకు గురైన వేళ బుమ్రా తనలో ఆత్మవిశ్వాసం నింపాడని తెలిపాడు. కాగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ మొత్తంగా 12 ఓవర్లు బౌల్‌ చేసి 47 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.

స్వల్ప ఆధిక్యం
కాగా తొలిరోజు సౌతాఫ్రికాను 159 పరుగులకు ఆలౌట్‌ చేసిన టీమిండియా.. శుక్రవారం ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 37 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో ఆటలో భాగంగా 189 పరుగులకు ఆలౌట్‌ అయి.. ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ 39 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: IPL 2026: స‌చిన్ త‌న‌యుడికి ముంబై ఇండియన్స్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement