ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డామియన్ మార్టిన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మెనింజైటిస్ కారణంగా తీవ్ర అనార్యోగానికి గురైన అతడు ప్రస్తుతం క్వీన్స్‌లాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న మార్టిన్‌కు వైద్యులు మత్తు మందు ఇచ్చి.. తాత్కాలికంగా కోమాలోకి వెళ్లేలా చేశారు.
తాత్కాలికంగా కోమాలోకి పంపి
మెనింజైటిస్ వల్ల మార్టిన్ మెదడు, ఇతర అవయవాలు పూర్తిగా చెడిపోకుండా ఉండేందుకు వైద్య ప్రక్రియలో భాగంగా డాక్టర్లు ఈ మేరకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని తాత్కాలికంగా కోమాలోకి పంపడం ద్వారా కార్డియాక్ అరెస్ట్ వంటి విపత్కర పరిస్థితుల నుంచి తప్పించే అవకాశం ఉంటుంది.
పదివేలకు పైగా పరుగులు
కాగా 1992 నుంచి 2006 మధ్యకాలంలో డామియన్ మార్టిన్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.
ఇక ఇటీవల ఆసీస్- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే టెస్టుకు ముందు మార్టిన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మార్టిన్ ఐసీయూలో ఉన్నాడన్న వార్తతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
త్వరగా తిరిగి రావాలి
ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెహమాన్ స్పందిస్తూ.. ‘‘డామియన్ మార్టిన్.. ఓ యోధుడు. త్వరలోనే అతడు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి’’ అని ఆకాంక్షించాడు. మరోవైపు.. మార్టిన్ ప్రాణ స్నేహితుడు ఆడం గిల్‌క్రిస్ట్ న్యూస్ కార్ప్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. అతడి కుటుంబానికి అందరమూ అండగా ఉందాము. అతడి ఆరోగ్యం కోసం ప్రార్థించండి’’ అని పిలుపునిచ్చాడు.
కాగా మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే రక్షిత పొరలు మెనింజెస్‌లో వాపు వస్తే.. ఆ పరిస్థితిని మెనింజైటిస్ అంటారు. బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు ఇందుకు ప్రధాన కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, మెడ బిగుసుకుపోవడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కావొచ్చు కూడా!.. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.


