భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) తొలి రోజు ఆట ముందుగానే ముగిసిపోయింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బౌలర్ల విజృంభణ కారణంగా మొదటి రోజు ఆతిథ్య భారత్.. ప్రొటిస్ జట్టుపై పైచేయి సాధించింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా
రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం టెస్టు సిరీస్ మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
159 పరుగులకే ఆలౌట్
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బవుమా బృందం టీమిండియా బౌలర్ల విజృంభణ ముందు ఎక్కువ సేపు నిలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లు ఆడి 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) ఓ మోస్తరుగా రాణించగా.. వీరిద్దరని భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వెనక్కి పంపించాడు.

వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 51 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక కెప్టెన్ తెంబా బవుమా దారుణంగా విఫలమయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.
ఒకే ఓవర్లో
మరోవైపు.. టోనీ డి జోర్జి (55 బంతుల్లో 24) నిలబడే ప్రయత్నం చేయగా బుమ్రా.. అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వికెట్ కీపర్ కైల్ వెరెన్నె(16)తో పాటు.. మార్కో యాన్సెన్ (0)ను ఒకే ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు.
కార్బిన్ బాష్ (3)ను అక్షర్ పటేల్ ఎల్బీడబ్ల్యూ చేయగా.. సైమన్ హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0)ల వికెట్లు కూల్చి.. బుమ్రా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు చరమగీతం పాడాడు. ట్రిస్టన్ స్టబ్స్ 74 బంతులు ఎదుర్కొని 15 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
భారత బౌలర్లలో పేసర్లు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
జైసూ విఫలం
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన లభించిన లైఫ్‌లను దుర్వినియోగం చేసుకున్నాడు.
మొత్తంగా 27 బంతులు ఎదుర్కొన్న జైసూ.. మూడు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 59 బంతుల్లో 13, వన్‌డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ 38 బంతుల్లో 6 పరుగులతో క్రీజులో నిలిచారు.
ప్రత్యర్థిని తొలిరోజే ఆలౌట్ చేసి.. పైచేయి
ఫలితంగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్.. 20 ఓవర్ల ఆటలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 122 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా ప్రత్యర్థిని తొలిరోజే ఆలౌట్ చేసి గిల్ సేన ఆధిపత్యం కొనసాగించింది.
చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్‌పై కుంబ్లే ఫైర్


