
మానసిక కుంగుబాటుతో అఘాయిత్యం
అనంతపురం: హెచ్చెల్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.సుమియ(32) ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక కుంగుబాటుకు గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని రామప్ప వీధిలో నివాసం ఉండే కొండకమర్ల బాబాసాహెబ్ రెండో కుమార్తె కె.సుమియ కు గుంతకల్లుకు చెందిన పామిడి మహమ్మద్ షఫీతో 2020లో వివాహమైంది. ఈమె అనంతపురం హెచ్చెల్సీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఆర్.కె.నగర్‌లో నివాసం ఉంటున్నారు.
వీరికి మూడేళ్ల వయసున్న మన్హా సాఫియా, రెండేళ్ల వయసున్న మహిరా ఇరమ్ సంతానం. రెండో కాన్పు తర్వాత నుంచి సుమియాకు హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజులుగా మాత్రలు వేసుకోకపోవడంతో మానసిక రుగ్మత అధికమైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని పలు దఫాలుగా ప్రయత్నించగా కుటుంబ సభ్యులు వారించారు. ఈ విషయాన్ని మహమ్మద్ షఫీ తన మామ బాబాసాహెబ్‌కు చెప్పాడు. దీంతో ఆయన గురువారం సుమియా ఇంటికి వచ్చారు.
ఆమెకు నచ్చచెప్పి డాక్టర్ వద్ద చూపించారు. అయినా కూడా సుమియా నిద్రకపోకుండా తాను చనిపోతానంటూ ఏడుస్తూనే ఉండటంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఓదార్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అందరూ కలిసి భోజనం చేసి, నిద్రపోయారు. సుమియా, ఆమె భర్త షఫీ, చిన్నపిల్లలు ఒక బెడ్‌రూంలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుమార్తె నిద్రపోయిందా లేదా అని బాబాసాహెబ్ గదివైపు రాగా.. అప్పటికే సుమియా చీరతో ఫ్యానుకు వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి సుమియా చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి, భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేశారు.