
యువతిని బెదిరించిన ప్రేమికులు
మనస్తాపంతో ఆత్మహత్య
అనంతపురం: ‘నువ్వే మా ప్రేమకు అడ్డు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం. నువ్వు చనిపోవాల్సిందే’ అంటూ ఓ యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేమికులు ప్రేరేపించిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన పూజారి స్వాతి (21) అనంతపురంలోని నలంద డిగ్రీ కళాశాలలో యూజీ మూడో సంవత్సరం చదువుతోంది.
ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు దీపు రక్త పరీక్ష కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, మరో టెక్నీషియన్ అయిన యువతితో స్వాతి స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో అరుణ్‌కుమార్, స్వాతి ప్రేమలో పడ్డారు. విషయం తెలుసుకున్న సదరు యువతి సోమవారం ఉదయం స్వాతికి ఫోన్ చేసి మందలించింది. ‘నా ప్రియుడిని ఎలా ప్రేమిస్తున్నావు.. మేమిద్దరమూ ముందు నుంచి ప్రేమలో ఉన్నాం. నీవు అడ్డు వస్తున్నావు. ఈ విషయం ల్యాబ్‌లో, మీ హాస్టల్‌లో అందరికీ చెబుతాను’ అని బెదిరించింది. అదే ధోరణిలో అరుణ్‌కుమార్ కూడా ఆ యువతికి వత్తాసు పలుకుతూ స్వాతిని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన స్వాతి... సోమవారం ఉదయం 7.30 గంటలకు తాను ఉంటున్న బాలాజీ లేడీస్ హాస్టల్‌లో గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వాతి తండ్రి పూజారి నాగభూషణం ఫిర్యాదు మేరకు అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.