
గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్‌లో ఓ వైన్ షాపు వద్ద మద్యం తాగుతూ బేల్దారి పెద్దన్న (39) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం యడవలి గ్రామానికి చెందిన పెద్దన్న బేల్దారి పని చేస్తుంటాడు. ఆదివారం ఉదయం ఓ వైన్ షాపులో మద్యం కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న అనధికార పర్మిట్ రూమ్‌లో బండలపై కూర్చొని కొద్ది కొద్దిగా తాగుతుండగా 15 నిమిషాల్లోనే విపరీతంగా మైకం తలకెక్కి కిందకు ఒరిగిపోయాడు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి కూడా విపరీతమైన మైకంలో తూలుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత కొందరు వెళ్లి చూడగా పెద్దన్న మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి చిన్న పెద్దక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్ సీఐ మనోహర్ చెప్పారు. మద్యం తాగిన వ్యక్తి కుప్పకూలిపోయి చనిపోయాడని తోటి మందుబాబులు, స్థానికులు వైన్ షాపు సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం తాగడానికి ఏర్పాటు చేసిన బండలను పగులగొట్టారు. కాగా, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు రట్టయిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన నకిలీ మద్యం తాగినందునే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.