
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.
– ప్రియాంక, హైదరాబాద్
మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి.
ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు.
గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు.
దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు.
భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.
నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్‌పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?
– స్వాతి, విజయవాడ
మీ పీరియడ్స్ రెగ్యులర్‌గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు.
ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్‌గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది.
చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు.
నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..)