
డాక్టర్‌గారు, నాకు 45 ఏళ్లు. దాదాపు సంవత్సరం రోజులుగా రుతుస్రావం రాలేదు. ఇది మెనోపాజ్ అనుకున్నాను కాని, ఇప్పుడు మళ్లీ రక్తస్రావం వస్తోంది. ఇది ఏదైనా పెద్ద సమస్యనా అని చాలా భయపడుతున్నాను.
– లావణ్య, తూప్రాన్
ఒక మహిళకు 45 ఏళ్లు దాటాక వరుసగా 12 నెలలు రుతుస్రావం లేకపోతే మెనోపాజ్ దశలో ఉన్నట్లుగా పరిగణిస్తాం. అయితే ఆ తర్వాత రక్తస్రావం వస్తే దాన్ని పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇది తరచు కనిపించే సమస్యలలో ఒకటి. అయినప్పటికీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. సుమారు ఐదు శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది.
అందులో ఎక్కువగా కనిపించే కారణం అట్రోఫిక్ వెజైనిటిస్. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల యోని గోడలు పలచబడి చిన్న గాయాలు అవుతాయి. దాంతో రక్తస్రావం మాత్రమే కాకుండా, పదే పదే మూత్రపిండ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. మరికొంతమందిలో గర్భాశయం లోపల ఏర్పడే పాలిప్స్ వలన రక్తస్రావం ఉంటుంది. ఇవి గడ్డల్లా మారుతాయి.
పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ ఉన్నవారిలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఇవే కారణం అవుతాయి. వీటిలో తొంభై శాతం ఫాల్స్ అయినప్పటికీ నిర్ధారణ అవసరమే! ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా లేదా గర్భాశయ క్యాన్సర్‌కు కారణం అవుతుంది. దాదాపు పది శాతం కేసుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. హైపర్‌ప్లాసియాలో కూడా ఏటిపికల్ అనే రకం ఉంటే కేన్సర్‌గా మారే ప్రమాదం ఎక్కువ.
అరుదుగా యోని లేదా వల్వా కేన్సర్లు కూడా ఈ రక్తస్రావానికి కారణం కావచ్చు. మధుమేహం ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు, గర్భాశయ కేన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మెనోపాజ్ లక్షణాలను తగ్గించుకోవడానికి ఈస్ట్రోజన్ మాత్రలు తీసుకునే కొంతమందికి కూడా రక్తస్రావం కలగవచ్చు.
అందుకే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వస్తే అది పెద్ద విషయం కాదని ఊహించుకోవడం తప్పు. ఎక్కువసార్లు కారణం తేలికపాటిదే అయినా, కొన్నిసార్లు తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి ఒకసారి అయినా గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్, ఎండోమెట్రియల్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం.
డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్