
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదమా? ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందా?
– శైలజ, గుంటూరు
గర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గర్భస్థ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) అంటారు. ఇది గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన వస్తుంది. ఎక్కువగా ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య కనిపిస్తుంది.
అందుకే ఆ సమయంలో ఓజీటీటీ పరీక్షను చేయాలని ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఇప్పుడు మీలో గర్భస్థ మధుమేహం నిర్ధారణ కావడంతో, కొంచెం ఆందోళన కలగడం సహజమే! దీనిని సరైన సమయంలో గుర్తించడం, నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గర్భస్థ మధుమేహం నియంత్రణలో లేకపోతే తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు లేదా రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
అలాగే శిశువు గర్భంలోనే బరువు ఎక్కువ కావచ్చు, ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత కొన్నిసార్లు బిడ్డకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయి లేదా స్వల్ప శ్వాస ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణంగా సులభంగా చికిత్స చేయగలిగినవే. గర్భస్థ మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే మీరు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం.
ఆహారం, వ్యాయామాలతో ఈ మధుమేహం నియంత్రణ కాకపోతే, డాక్టర్లు సురక్షితమైన మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సూచిస్తారు. ఇవి తల్లికీ, బిడ్డకీ పూర్తిగా హానికరం కాదు. సరైన నియంత్రణతో గర్భస్థ మధుమేహం సాధారణంగా ప్రసవం జరిగిన వెంటనే తగ్గిపోతుంది. కాని, కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా మందులు, ఆహార నియమాలు కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోవాలి.
నాకు గతంలో ఏడు వారాలలో గర్భస్రావం అయింది. ఇప్పుడు గర్భవతిని. ఈ గర్భధారణలోనూ ఇప్పటివరకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ నాకు విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. ఇది నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దయచేసి మార్గనిర్దేశం చేయండి.
– రూప, కర్నూలు
గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశలో బిడ్డ ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో గర్భస్రావం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
అయితే ప్రతి రక్తస్రావం గర్భస్రావానికే సంకేతం కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, గర్భాశయంలో చిన్న మార్పుల వలన కూడా రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణంగా హానికరం కావు. కాని, రక్తస్రావం వచ్చిన ప్రతిసారీ డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ మీ వైద్య చరిత్ర తెలుసుకొని, శరీరపరీక్ష చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా ఆందోళన అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైనవి.
కొన్నిసార్లు ప్రొజెస్టరాన్ మందులు ఇస్తారు. రక్తస్రావం అధికంగా ఉంటే ఆసుపత్రి పర్యవేక్షణ అవసరం కావచ్చు. గతంలో గర్భస్రావం అనుభవించారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భస్రావం తర్వాత మళ్లీ అదే జరుగుతుందన్న నిబంధన లేదు. సమయానికి వైద్యుల సహాయం తీసుకుంటే చాలామంది మహిళలు సురక్షితంగా గర్భధారణను కొనసాగించి, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి వైద్యుల సూచనలు పాటించడం అత్యంత ముఖ్యం.
డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్