
యాభై ఏళ్లలోపు పురుషుల్లో టైప్–2 డయాబెటిస్ అనేది టైప్–1 కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుంది. అదే మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్ అనేదే ఎక్కువ దుష్ప్రభావాలు చూపుతుందని తేలింది. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా పేషెంట్లపై స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...
కాస్తంత చిన్నవయసు పురుషుల్లో అంటే 50 ఏళ్లలోపు పురుషుల్లో టైప్–1 డయాబెటిస్ కంటే టైప్–2 డయాబెటిస్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలగజేస్తుంది. ఉదాహరణకు టైప్–2 డయాబెటిస్‌తో బాధపడుతున్న పురుషుల్లో 51 శాతానికి పైగా వ్యక్తుల్లో గుండెజబ్బుల (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) ముప్పు ఉంటుంది. దాంతోపాటుగా హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె΄ోటు రిస్క్ కూడా వాళ్లలో రెట్టింపు ఉంటుంది.
దీనికి కారణాలు ఆ వయసులో పురుషుల్లో ఊబకాయం, హైబీపీ జబ్బులతోపాటు వారి జీవనశైలి కాస్త అస్తవ్యవస్తంగా ఉండటంతో అది టైప్–2 డయాబెటిస్ తాలూకు దుష్ప్రభావాలను మరింతగా ప్రేరేపిస్తుంది. అయితే పురుషుల వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ముప్పు క్రమంగా కాస్త తగ్గుతూ పోతుంది. అంటే వాళ్ల వయసు 60కి చేరేనాటికి వాళ్లలో టైప్–1 డయాబెటిస్‌తో వచ్చే ముప్పు కంటే టైప్–2 డయాబెటిస్‌తో వచ్చే ముప్పులు కాస్త తగ్గుతాయని చెప్పవచ్చు.
ఇక వాళ్ల వయసు 70కి చేరేనాటికి టైప్–1 డయాబెటిస్‌తో ఉన్నవారిలో వచ్చే గుండెపోట్ల కంటే టైప్–2 డయాబెటిస్‌తో ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ముప్పు 26 శాతం తక్కువ. ఇక మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్‌తో ముప్పు ఎక్కువ. అందునా అది ఏ వయసువారిలోనైనా ఎక్కువే. ఇలా టైప్–1 డయాబెటిస్‌తో బాధపడే యువతులూ, మహిళల్లో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు టైప్–2 డయాబెటిస్‌తో బాధపడే మహిళల కంటే ఎక్కువే.
అదే మహిళల వయసు 50 దాటాక... టైప్–1 డయాబెటిస్ బాధపడేవాళ్లతో పోలిస్తే టైప్ – 2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు 25 నుంచి 47 శాతం తక్కువ. ఇక అన్ని రకాల గుండెజబ్బుల ముప్పులనూ పరిగణనలోకి తీసుకుంటే టైప్ –2 డయాబెటిస్‌తో బాధపడే మహిళల్లో గుండెజబ్బులతో మృతిచెందడానికి ఉన్న అవకాశాలు టైప్ – 1 మహిళల కంటే 19 శాతం తక్కువ. దీన్ని బట్టి తేలిసేదేమిటంటే... టైప్ –1 అలాగే టైప్ –2 డయాబెటిస్‌ల ముప్పులు ఇటు మహిళలూ, అటు పురుషుల్లో వేర్వేరు దుష్ప్రభావాలను చూపుతుంటాయని ఈ స్వీడిష్ అధ్యయనంలో వెల్లడైంది.
(చదవండి: ఈ జబ్బులకు లింగ వివక్ష?)