
అదేమిటో గానీ... కొన్ని జబ్బులు కక్ష పట్టినట్టుగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్లపైనే తమ దుష్ప్రభావాలు ఎక్కువగా చూపిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌కు చెందిన రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ), మయోసైటిస్ వంటివి. అవి వాళ్లలోనే ఎందుకలా వస్తాయన్న విషయాన్ని అనన్య అనే ఓ అమ్మాయి వృత్తాంతంతో డాక్టర్లు వివరిస్తున్నారు. అనన్య కథేమిటో చూద్దామా!
ఓ అనన్య కథ అనన్య 24 ఏళ్ల ఓ అమ్మాయి. పెదవుల మీద చెరగని చిర్నవ్వు... ఎల్లప్పుడూ చకచకా కదులుతూ ఉండే చురుకుదనం... కళ్లనిండా భవిష్యత్తు మీద ఆశ! మొన్ననే కాలేజీ చదువులు పూర్తి చేసిన ఆ అమ్మాయి ఇటీవలే ఓ ఐటీ కంపెనీలో చేరింది. అలా చదువై΄ోయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఈమధ్య అంతగా ఉండటం లేదు. కారణం... ఆమె ఉదయాలు కష్టంగా మారాయి. వేళ్ల కణుపుల వద్ద వాపు బ్రష్ చేయనివ్వడం లేదు. ఆఫీసులో కీబోర్డు మీద టైప్ కూడా చేయనివ్వడం లేదు. మెట్లెక్కే సమయంలో మోకాళ్లలో నొప్పి.
ఆమె మొదట్లో ఈ బాధను కాస్త తేలిగ్గా తీసుకుంది. సిస్టమ్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్లనో లేదా పని ఒత్తిడి కారణంగాలో ఇలా జరుగుతోందని అనుకుంది. పోనుపోనూ ఈ నొప్పి... తొలుత అసౌకర్యంగా... తర్వాత ఇబ్బందికరంగా... ఇప్పుడు బాధాకరంగా మారింది. తన రోజువారీ పనుల మీద తీవ్ర ప్రభావం చూపడం మొదలైంది. మొదట్లో కుటుంబ సభ్యులు ఆమెను తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు.
తనను పరీక్షించిన డాక్టర్ ఆమెను రుమటాలజిస్ట్ దగ్గరికి పంపారు. జాయింట్ల పరిశీలనా, రక్తపరీక్షలూ అయ్యాక ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్ధారణ అయ్యింది. ఆర్థరైటిస్‌లో అదోరకం. అనన్య జీవితంలో అదో అతిపెద్ద షాక్!! ‘‘ఆర్థరైటిసా? ఈ వయసులోనా? సాధారణంగా అది వృద్దాప్యంలో వచ్చే వ్యాధి కదా’’ అనుకుంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు. ‘‘నేనిక పని చేయగలనా? పెళ్లి మాటేమిటి? నేనెప్పటికీ ఈ నొప్పులతోనే బతకాలా? ఈ మందులు సురక్షితమేనా? వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఆ దుష్ప్రభావాలతో ఇక సహజీవనం తప్పదా???
ఆమె మనసులో మెదిలే అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
డాక్టర్ చెప్పినట్టుగా పురుషులతో ΄ోలిస్తే ఈ తరహా ఆర్థరైటిస్‌ల వ్యాప్తి, దుష్ప్రభావాలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ, వాటిని అ«ధిగమించడమెలాగో, ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.
∙∙
అసలు ఆటోఇమ్యూన్ రుమాటిక్ వ్యాధులు అంటే ఏమిటి?
మన శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) ఎల్లప్పుడూ మనల్ని వైరస్‌లూ, బ్యాక్టీరియా బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. అయితే ఈ క్రమంలో మన వ్యాధి నిరోధక కణాలు... ఒక్కోసారి తమ ఒంట్లోని సొంత కణాలనే శత్రు కణాలుగా పొరబడతాయి. వాటితో తలబడతాయి. అలా మన సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ తన సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధులనే ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్’గా చెబుతారు.
ఇలా దాడి చేసే క్రమంలో అవి మన కీళ్లు (జాయింట్లు), కండరాలు (మజిల్స్), చర్మం, కొన్ని సందర్భాల్లో ఒంట్లోని కీలక అవయవాలపై తీవ్రంగా దాడి చేసి, బాధిస్తాయి. ఈ తరహా వ్యాధులు యువతులు / మహిళల్లో తమ 20 నుంచి 40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి. దాంతో వాళ్ల చదువులూ, కెరియర్, కుటుంబ జీవితంపై ప్రభావం చూపడటంతో భావోద్వేగాల పరంగా కూడా వీళ్లు ఎక్కువగా ప్రభావితమవుతుంటారు.
కొన్ని ప్రధానమైన జబ్బులివి...
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్‌ఏ) : ఇది రెండు చేతులూ, మోకాళ్లలోని కీళ్లను (జాయింట్స్)ను ప్రభావితం చేస్తుంది.
యాంకలైజింగ్ స్పాండిలైటిస్ : మెడ, వెన్నెముకలను ప్రభావితం చేస్తుంది.
సోరియాటిక్ ఆర్థరైటిస్ : సోరియాసిస్‌లో లాగా జుట్టు నుంచి వెండిరంగులో ఉండే చర్మం సొలుసులు రాలడంతోపాటు కీళ్లవాపు, తీవ్రమైన కీళ్ల నొప్పులు కనిపిస్తాయి.
జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ : చిన్నపిల్లలూ, టీనేజీలో ఉండే కౌమార వయసులో ఉండే పిల్లల్లో కనిపించే ఎముకల, కీళ్ల వ్యాధి ఇది.
ఎక్కువగా మహిళల్లోనే... ఎందుకిలా?
అనేక గణాంకాల నుంచి లభ్యమైన వివరాల ప్రకారం ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఇవి వాళ్లలోనే ఎక్కువగా కనిపించడానికి కారణాలు...
హార్మోన్ల ప్రభావం: ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ప్రధానంగా మహిళల్లోనే ఎక్కువగా స్రవిస్తుంది. ఈ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం.
జన్యుపరమైన అంశాలు: మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు (జీన్స్) ఈ తరహా వ్యాధులను ప్రేరేపించడం.
ఇమ్యూన్ వ్యవస్థలో తేడాలు: స్వాభావికంగా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక (ఇమ్యూన్) వ్యవస్థ చాలా బలంగా, శక్తిమంతంగా ఉంటుంది. అదే కారణం చేత... ఒకవేళ ఆ ఇమ్యూన్ వ్యవస్థ తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉండటం.
ఈ జబ్బుల తాలూకు మందుల పట్ల ఉండే భయాలివి...
ఈ జబ్బుల్లో సాధారణంగా కొన్నింటికి మందుల వల్ల కొన్ని రకాల భయాలూ, ఆందోళనలూ ఉంటాయి. కారణం కొన్ని సందర్భాల్లో సైడ్‌ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుండటమే. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ సైడ్‌ఎఫెక్ట్స్ తాత్కాలికమే. ఈ మందులన్నీ చాలావరకు సురక్షితమే. ఇటీవల బయాలజిక్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మందులతో అంతగా ప్రభావం కనిపించనివాళ్లలో డాక్టర్లు ఈ కొత్తరకం మందులైన బయాలజిక్స్‌నూ వాడుతుంటారు.
చికిత్స తీసుకోకపోతే... చాలా కేసుల్లో ఈ లక్షణాలు చాలామందిలో ఏదో ఒక సమయంలో కనిపించే చాలా సాధారణ లక్షణాలనే కలిగి ఉండటంతో చాలామంది మొదట్లో నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఈ తరహా వ్యాధుల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం జరుగుతుంది. కొందరిలో శాశ్వత వైకల్యమూ కలగవచ్చు. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ వ్యాధితో సాధారణ ప్రజల్లాగే జీవించడానికి...
పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. పూర్తిగా మానేయడం మంచిది.
యోగా, ఈత, నడక వంటి తేలికపాటి వ్యాయామాలను నిత్యం చేస్తుండటం.
కీళ్ల జబ్బులు కనిపించగానే డాక్టర్లు సూచించిన సహాయక పరికరాలను వాడుతుండటం.
ద్యానం, మంచి హాబీలతో, రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం.
ఎముకల ఆరోగ్యం కోసం డాక్టర్లు సూచించిన విధంగా క్యాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవడం. ∙∙
చివరగా... ‘‘నేను మళ్లీ మామూలుగా జీవించడం సాధ్యమవుతుందా?’’ అడిగింది అనన్య. ‘‘పూర్తిగా సాధ్యమే. ఇది కలలకు ముగింపు కాదు. కొద్దిపాటి జాగ్రత్తలతో పూర్తిస్థాయిలో మామూలు జీవితం గడపవచ్చు. కెరియర్, పిల్లలూ, ప్రయాణాలూ... ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి. కాకపోతే డాక్టర్లు సూచించిన మందులూ, జాగ్రత్తలూ పాటించాలి. ఇక ముందుగానే గుర్తించడం, అవగాహన కలిగి ఉండటం, నిరంతర పర్యవేక్షణ... ఇవీ మనకు అవసరమైన తారక మంత్రాలు’’ అంటున్న డాక్టర్ల మాటలు ఈ తరహా ఆర్థరైటిస్ వ్యాధులతో బాధపడే మహిళల జీవితాలకు ఒక మంచి భరోసా.
ఈ జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన రుమటాలజిస్టులను సంప్రదించాలి. ఎందుకంటే ఈ లక్షణాలు మామూలుగా చాలామందిలో చాలా సాధారణంగా కనిపించేవి కావడంతో సాధారణ డాక్టర్లు వెంటనే వాటిని గుర్తించలేకపోవచ్చు. దాంతో చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ దుష్ప్రభావాలూ, కీళ్లు దెబ్బతినడం కూడా పెరగడం జరగవచ్చు. రుమటాలజిస్టలను కలిస్తే వారు కొన్ని పరీక్షలు చేయిస్తారు. అవి...
ఈఎస్‌ఆర్, సీఆర్‌పీ, రుమటాయిడ్ ఫ్యాక్టర్, ఏఎన్‌ఏ, యాంటీ సీసీపీ, కీళ్ల (జాయింట్ల) ఎక్స్–రే, అల్ట్రా సౌండ్ పరీక్షల వంటివి.
వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే రుమటాలజిస్టులు డీఎమ్‌ఏఆర్‌డీ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) అని పిలిచే మెథోట్రెక్సేట్, హైడ్రాక్సీక్లోరోక్విన్, సల్ఫాసలాజీన్ వంటి మందులను సూచిస్తారు. వీటిని ఎంత త్వరగా మొదలుపెడితే... జరగబోయే నష్టాలు అంతగా నివారితమవుతాయి.
చికిత్సలు మొదలయ్యాక క్రమం తప్పకుండా ఫాలో అప్‌లకు వెళ్తుండాలి. అప్పుడు డాక్టర్లు మందుల ప్రభావాన్ని తరచూ పరీక్షిస్తూ మోతాదులను సవరిస్తుంటారు.
డాక్టర్ విజయ ప్రసన్న పరిమిసీనియర్ రుమటాలజిస్ట్
(చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!)