
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
– సుశీల, నాగర్‌కర్నూల్
సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది.
ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్‌లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి.
మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.
నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?
– కీర్తి, వరంగల్
గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్‌నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు.
మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్‌సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి.
వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి.
మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు.
డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్