
నా భార్య వయసు 45 ఏళ్ళు. మాకు ఒక సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. మంచి ఉన్నతమైన కుటుంబం. మా ఆవిడకు మొదటి నుంచి ఒక వింత అలవాటు ఉంది. షాపింగ్‌కు వెళ్లినపుడు అవసరం లేకపోయినా, కొనగలిగిన స్థోమత ఉన్నా, ఏదో ఒక వస్తువు దొంగిలిస్తుంది. ఆమె దొంగిలించే వాటిలో కాస్మెటిక్స్ లాంటి చిన్న వస్తువుల నుంచి, ఒక్కోసారి చీరలు, చిన్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అలా దొంగిలించినవి కొన్ని ఇంట్లో దాచిపెడుతుంది. కొన్నేమో ఇతరులకు తాను గొప్ప అనిపించుకోవడానికి అన్నట్లు పంచిపెడుతుంది. ఆమెకు 300లకు పైగా చీరలు,కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఒక్కోసారి నా జేబులోంచి కూడా, నాకు చెప్పకుండా డబ్బులు తీసి దాస్తుంది. ఇన్ని చేసినా ఏమి తెలియనట్లు ఉంటుంది. ఏమాత్రం గిల్టీగా ఫీలవదు. ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా, ఆమె ఎందుకు ఇలా చీప్‌గా దొంగతనాలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేసి కొన్నిసార్లు షాప్స్‌లో పట్టుబడితే, పొరపాటయిందని సారీ చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. సాక్షిలో మీ కాలమ్ చూసి, మీరే ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నాను!
– కామేశ్వరరావు, హైదరాబాద్
రావుగారూ! మీరెంతో ఆవేదనతో మీ సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లుగా ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ ఉన్నా, అవసరం లేకున్నా ఇలా దొంగతనాలు చేయడాన్ని ‘క్లెప్టోమెనియా’ అంటారు. ఇది చాలా అరుదైన ఒక వింత మానసిక సమస్య. ఈ సమస్య ఉన్న వారికి, ఎలాగైనా ఏదో ఒకటి దొంగిలించాలనే ‘తహ తహ’ ఉంటుంది. వాస్తవానికి ఆ దొంగిలించిన వస్తువు వల్ల వారికి ఎలాంటి అవసరం ఉండదు.
ఆ వస్తువు విలువ కూడా చాలా స్వల్పమై ఉండవచ్చు. మామూలు దొంగతనాల లాగా వీరు ఏదీ ప్లాన్ చేసుకుని, దొంగతనాలు చేయరు. ఏదైనా షాపింగ్‌కి అని వెళ్లినపుడు అలా సడన్‌గా చేతికందిన ఏదో ఒక వస్తువును వారికవసరం లేకపోయినా ఎత్తేస్తుంటారు. బాగా స్థోమత కలిగి, డబ్బులు పెట్టి కొనగలిగిన వారిలోనే ఈ అలవాటు ఎక్కువ. బహిష్టు సమయంలో ఇలాంటి కోరిక, కొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కనబడిన వస్తువు ఎత్తేయకుంటే విపరీతమైన టెన్షన్‌కు గురయి, తీసిన తర్వాత చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు. దీనిని ‘ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్’ అని కూడా అంటారు.
ఈ అలవాటు యుక్తవయసులో మొదలై పెద్దయ్యే కొద్ది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొందరిలో మాత్రం శాశ్వతంగా ఉండి΄ోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఆ వ్యక్తి సహకరించాలి. కొన్నిరకాల మందులతో పాటు ‘కాగ్నిటివ్ బిహేవియర్ మాడిఫికేషన్’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని ఈ అలవాటు నుండి బయటపడేసే అవకాశముంది. మొదట్లోనే ఈ అలవాటు గుర్తించి మానసిక వైద్యుడిని కలిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇప్పటికైనా మీ భార్యను మంచి నిపుణులైన సైకియాట్రిస్ట్ క్లినికల్ సైకాలజిస్టుల పర్యవేక్షణలో తగిన థెరపీ చేయించండి. ఆల్‌దిబెస్ట్!
డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)