
జంక్ ఫుడ్ మానేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని అర్జున అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు వద్ద ఆదివారం వాకథాన్ నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోపీచంద్ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ నడకకు సమయం కేటాయించాలని సూచించారు. శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, అవసరం లేని ఆహారం ఆరోగ్యానికి చేటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గోకల్‌రెడ్డి, రామకృష్ణ జనపాటి, సందీప్ పాల్గొన్నారు.
రెయిన్ బో ఆస్పత్రిలో..
బంజారాహిల్స్ రెయిన్ బో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్ హార్ట్ క్లినిక్‌ను పుల్లెల గోపీచంద్ ఆదివారం ప్రారంభించారు. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల తెలిపారు. అత్యాధునిక ప్రమాణాలతో, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సెంటర్ కొనసాగుతుందని వారు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుందని గోపీచంద్ అన్నారు. జాతీయ ఉత్తమ బాల పురస్కార గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి పాల్గొన్నారు.