
అందరు బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. రకరకాల మార్గాల్లో తగ్గడంపై దృష్టిపెట్టి మరి ఆరోగ్య స్ప్రుహ పెంచుకుంటున్నారు. అయితే హాయిగా ఉన్నప్పుడే మన బాడీ మీద ఫోకస్ పెట్టడం, ఆరోగ్యంపై ధ్యాస వంటివి చేయగలం. కానీ ఈ తల్లికి కూతురు అనారోగ్యమే బరువు తగ్గేందుకు దారితీసింది. డైట్‌పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మర్చేసింది. అలాంటి కష్ట సమయాల్లో ఎవ్వరైనా..తమ ఉనికిని కోల్పోయేంతగా బాధలో ఉండిపోతారు..కానీ అదే ఆమెకు ఆరోగ్యంపై అటెన్షన్ పెట్టేలా చేసింది. పైగా కిలోల కొద్ది బరువు తగ్గి, స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె వెయిట్‌లాస్ స్టోరీ గురించి తన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.
ఆ అమ్మే 40 ఏళ్ల కింబర్లీ పావెల్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఆమె పీసీఓఎస్‌తో ఇబ్బంది పడుతుండేది. బిజీ జీవితం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యం చేసుకుంటూ సూమారు 68 కిలోలు మేర బరువు తగ్గింది. వాస్తవానికి కింబర్లీ దాదాపు 136 కిలోల అధిక బరువుతో బాధపడుతుండేది. తన సోషల్ మీడియా ఫాలోవర్‌లను ప్రేరేపించేలా బరువు తగ్గేందుకు శ్రీకారం చుట్టింది. అంతలో అనుహ్యంగా ఆరేళ్ల కూతురు కేన్సర్ బారిన పడటంతో డైట్‌పై ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయింది కింబర్లీకి.
తాను ఆరోగ్య విషయంలో చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని..సరైన మార్గంలో బరువు తగ్గాలని భావించింది. ఆ నేపథ్యంలో ఎక్కువగా చేసే సాధారణ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. అంతేగాదు ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోకపోతే ఎలా విషంగా మారుతుందో అర్థం చేసుకుంది. తనకెదురైన సవాళ్లే పూర్తిగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టేలా చేశాయని చెబుతోంది. అయితే తాను 68 కిలోల మేర బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలేమి పాటించలేదని, సింపుల్ చిట్కాలనే అనుసరించానని చెప్పుకొచ్చింది.
బరువు తగ్గిన విధానం..
నిలకడగా ఉండాలి...
బరువు తగ్గాలనే ఫోకస్‌ని మధ్యలో వదిలేయకుండా స్ట్రాంగ్ ఉండే మనస్సుని డెవలప్ చేసుకోవడం. ఈ రోజు కంటే మరింతగా భిన్నంగా కనిపించాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి.
పోషకాహారంపై ఫోకస్..
ప్రోటీన్, ఫైబర్ ఉండేవి తీసుకుంటున్నామో లేదో కేర్ తీసుకోవాలి. రోజువారీగా 130 నుంచి 150 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉంటుందో లేదో చూసుకోవాలి.
చురుకుగా ఉండటం..
ప్రతి రోజు వర్కౌట్లపై దృష్టి పెట్టడం. కనీసం 40 నిమిషాలు వాకింగ్, వ్యాయమాలు చేసేలా చూసుకోవడం. అవి భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి.
అతి ఆకలిని నివారించటం
ఎక్కువ ఆకలి వేసేంత వరకు కాకుండా..బ్యాలెన్స్‌గా తినేలా చూసుకోవాలి. బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే అతిగా తినే ప్రమాదం ఉంది. ఆకలి అనిపించిన వెంటనే..సంతృప్తి కలిగేలా మంచి ఆహారం తీసుకోవాలి.
చక్కెరకు దూరం..
స్వీట్స్ తినాలనిపించినప్పుడూ తెలివిగా తినాలి. ఎలాగంటే ఈ రోజు స్వీట్స్ ఎక్కువ తింటే మిగతా సమయంలో తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ తగ్గించి, వర్కౌట్ల సమయం పెంచాలి.
ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు..
ప్రోటీన్‌తోపాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి, ఎక్కువసే కడుపు నిండిన అనుభూతిని అందివ్వడాని ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సమతుల్యంగా తినేందుకు ప్రాముఖ్యత నివ్వడం.
కాఫీ అలవాట్లను మానుకోవడం..
కాఫీ తాగే అలవాటుని తగ్గించుకునేలా..ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి.
మైండ్‌ఫుల్‌గా తినటం..
మైండ్‌ఫుల్‌గా తినేలా చూసుకోవాలి. తగిన కేలరీలు, ప్రోటీన్లు శరీరానిక అందేలా చూసుకోవాలి.
చివరగా మితిమీరిన వ్యాయామాలు, అతి కఠినమైన ఆహార నియమాలు మొదటికే ప్రమాదం తెచ్చిపెడతాయని, నిధానంగా ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడమే అన్ని విధాల శ్రేయస్కరమని చెప్పుకొచ్చింది కింబర్లీ పావెల్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు)