
'పరిణీత' చిత్రంతో విద్యాబాలన్ (Vidya Balan) కెరీర్ మొదలైంది. ఈ సినిమా 2005 జూన్ 10న విడుదలైంది. శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన పరిణీత (1914) అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ సర్కార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది. ఆగస్టు 29న మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఇంత పరిచయమా? నాకు తెలీదు
ఈ సందర్భంగా విద్యాబాలన్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నాకు బాగా గుర్తు.. సైఫ్ అలీ ఖాన్ తల్లి, బాలీవుడ్ స్టార్ షర్మిల ఠాగూర్ (Sharmila Tagore) ఓరోజు సెట్‌కు వచ్చింది. తనను చూసేందుకు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆవిడంటే నాకెంతో ఇష్టం. మామధ్య ఎంతో అనుబంధం ఉందన్నట్లుగా ఒకరినొకరం పలకరించుకున్నాం. అది చూసిన సైఫ్.. ఓహ్, మీ ఇద్దరికీ ఇంత పరిచయముందని నాకింతవరకు తెలీదు అని సరదాగా జోక్ చేశాడు.

ఎప్పుడు గుర్తు చేసుకున్నా..
వెంటనే నేను నాకు ఆమె తెలుసు.. కానీ తనకు నేను తెలియదని బదులిచ్చాను. సైఫ్ సరదాగా ఉంటూ ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంటుంది. దాదా(ప్రదీప్ సర్కార్) వల్లే నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ప్రతి చిన్నవిషయాన్ని కూడా గుర్తించి సీన్ మళ్లీ చేయిస్తాడు. అవసరమైతే వంద టేకులైనా తీసుకుంటాడు.
కన్నీటి చుక్క సరిగ్గా రావాలని..
కేవలం మా పర్ఫామెన్స్ కోసమే కాదు, వెనకాల పావురాలు ఎగిరే క్షణాలు కూడా సరిగ్గా రావాలనుకుంటాడు. అన్నీ సరిగ్గా కుదరాలని భావిస్తాడు. ఒక పాటలో నేను ఏడవాల్సి ఉంటుంది. ఆ పాటలోని ఓ లైన్ దగ్గర నా కన్నీటిచుక్క కిందపడాలి. దీని కోసం 28 టేకులు తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రదీప్ సర్కార్.. అనారోగ్యంతో 2023లో కన్నుమూశారు.