అవును.. దయ్యాలు ఉన్నాయి... ఇవిగో... | Su From So Kannada language Movie Reviews and special story | Sakshi
Sakshi News home page

అవును.. దయ్యాలు ఉన్నాయి... ఇవిగో...

Aug 24 2025 5:56 AM | Updated on Aug 24 2025 5:57 AM

Su From So  Kannada language Movie Reviews and special story

దయ్యం కనపడినా భయపడతారు. దయ్యం ఎవరి ఒంటి మీదకు వచ్చినా భయపడతారు. అసలు దయ్యం మాటెత్తితేనే భయం. ఉన్నాయేమోనని భయం. ఉండే ఉంటాయని భయం. దయ్యాన్ని ఎవరైనా చూశారా?  చూసినవారు లేరు. అయినా భయమే. అన్నట్టు దెయ్యాలు ఉన్నాయా?  ఏమో... చూద్దాం...

పల్లెటూళ్లలో దెయ్యాల పుకార్లు మామూలే. కర్నాటకలోని ఆ పల్లెలో కూడా హఠాత్తుగా దయ్యాల గోల మొదలయ్యింది. నేను చూశానని ఒకరంటే అటు పోయింది అని మరొకరంటారు. దెయ్యాలు లేవు.. కాని ఒంటరి స్త్రీ కనిపిస్తే చాలు ఆమెను వేధించే మగాళ్లు దెయ్యాలు కాకపోతే మరెవరు అని ప్రశ్నిస్తూ తీసిన చిన్న సినిమా ‘సు ఫ్రమ్‌ సో’ కన్నడ నాట సూపర్‌హిట్‌ అయ్యింది. 5 కోట్లతో తీస్తే 125 కోట్లు సంపాదించింది. స్త్రీలను గౌరవించమని చెప్పిన మెసేజే కారణం.

కర్నాటక తీరప్రాంతంలో మంగళూరుకు దగ్గరగా ఉన్న చిన్న పల్లె ‘మర్లూరు’. ఈ ఊళ్లో అందరూ చిన్న చిన్న పనులు చేసుకు బతికేవారే. పెళ్ళిళ్లు, దినకర్మలు ఆర్భాటంగా చేస్తూ డాబుసరికి తగ్గని మనుషులే అందరూ. సరే... ఊరన్నాక వయసొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉండకుండా ఉంటారా. పెయింట్‌ పని చేసుకు బతికే ఒక కుర్రాడికి ఆ ఊళ్లో ఒకమ్మాయి తో మనసవుతుంది. 

ఇద్దరూ ప్రేమలో ఉండగా ఒక అర్ధరాత్రి ఆ అమ్మాయి ఇంటి గోడ దూకి దొరికిపోయే ప్రమాదానికి చేసుకుంటాడు పెయింటర్‌. దొరికితే తోలు వొలిచేస్తారు. పైగా పరువు పోతుంది. అందుకే అతడు తప్పించుకోవడానికి ఒంటి మీదకు దెయ్యం వచ్చినట్టుగా నటిస్తాడు. ఒంటి మీదకు దెయ్యం రావడం వల్లే అర్ధరాత్రి ఊళ్లో తిరుగుతున్నాడని అనుకునేలా చేస్తాడు. ఇంకేముంది. ఊళ్లోకి దయ్యం వచ్చేసినట్టే.

మనుషులకు రకరకాల నమ్మకాలు. బొట్టు పెడితే దయ్యాలు పోతాయని, కొరివి చూపిస్తే పోతాయని,... మామూలు దయ్యాలైతే పారిపోవచ్చు గాని నటించే దయ్యాలు ఎక్కడికి పోతాయి?

పెయింటర్‌కు దయ్యం పట్టిన సంగతి ఊరంతా తెలుస్తుంది. అతణ్ణి చూస్తే చాలు ఊరంతా పరుగే. పాపం ఆ పెయింటర్‌ తల్లిదండ్రులు ఇంట్లో ఉండలేక బయటకు పోలేక నానా బాధలు పడుతుంటారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు అప్పడం కర్ర్‌మన్నా, టైరు తుస్సుమన్నా దయ్యమేమోనని దడుచుకోవడమే. ఊళ్లోకి దయ్యం వస్తే దయ్యాన్ని వదలగొట్టే మంత్రగాడు రావడం ఆనవాయితీ. వచ్చి ‘నువ్వెవరు?’ అని అడుగుతాడు పెయింటర్‌ వొంటి మీదున్న దయ్యాన్ని. పెయింటర్‌కు ఏం చెప్పాలో అర్థం కాదు. ‘కాంచన’ సినిమా పోస్టర్‌ కనిపిస్తే ‘కాంచన’ అంటాడు. తలుపు బయట ఉన్నవారికి ‘సులోచన’ అని వినిపిస్తుంది. ‘ఎక్కణ్ణుంచి వచ్చావు’ అని అడుగుతాడు మంత్రగాడు. పెయింటర్‌ ఏమీ చెప్పకముందే ‘సోమేశ్వరం నుంచి అట’ అని జనమే అనుకుంటారు. ఊళ్లోకి వచ్చిన దెయ్యం ‘సోమేశ్వరం సులోచన... సు ఫ్రం సో’... అదే సినిమా టైటిల్‌ ‘సు ఫ్రమ్‌ సో’...

ఇక ఊళ్లో వాళ్లంతా ‘సోమేశ్వరం నుంచి వచ్చిన సులోచన’ ఏం చేస్తే పెయింటర్‌ను వదిలి వెళుతుందో అనే అన్వేషణ సాగిస్తారు. ఆ ఊరికి దాపునే ఉన్న సోమేశ్వరంలో సులోచన అనే పేరున్న ఆమె ఎవరైనా మరణించిందేమోనని కనుక్కుంటారు. ఇటీవల ఆ పేరుతో ఉన్న ఒక పెద్దామె మరణించిందని తెలుస్తుంది. ఆ ఇంటికి వెళితే ఆమె ఒక్కగానొక్క కూతురు కటిక పేదరికంలో ఉంటుంది. వయసొచ్చిన అమ్మాయి. ఇంకా పెళ్లి కాలేదు. ఒక్కత్తే నివసిస్తోంది. ఈ కూతురి ద్వారా తల్లి ఆత్మకి ఏం కావాలో తెలుసుకుందామని ఊరివాళ్లు ప్రయత్నిస్తారు. తల్లి ఆత్మను ఎలా శాంతింపచేయాలో ఆ అమ్మాయినే కనుక్కుని చెప్పమంటారు. 

కాని ఈప్రాసెస్‌లో ఆ అమ్మాయి కష్టాలు తెలిసేకొద్దీ అసలు దయ్యాలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుస్తుంది. ఆ అమ్మాయిని ఆమె బాబాయి చెరబట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తల్లి చనిపోయాక అతని ఆగడాలు మరీ శ్రుతి మించితే తలుపుకు అడ్డాలు పెట్టి రాత్రిళ్లు నిద్ర కాస్తూ ఉంటుంది. ఆ బాధ ఒకటైతే ఊళ్లోని పోరంబోకు కుర్రాళ్లు రాత్రిళ్లు గోడ దూకి తలుపు కొడుతుంటారు. ఒంటరి స్త్రీ మర్యాదగా బతుకుదామంటే దయ్యాల్లా మగాళ్లు పీక్కుతింటున్నారని ఆ అమ్మాయి కష్టాలు వింటే తెలుస్తుంది. 

పెయింటర్‌కు పట్టిన దయ్యం కంటే ఈ అమ్మాయి చుట్టూ ఉన్న దయ్యాలను ఒదిలించడమే ముఖ్యమని భావించిన ఊరు ఆ దుర్మార్గులకు దేహశుద్ధి చేయడంతో ‘సు ఫ్రం సో’ సినిమా ముగుస్తుంది. దుర్మార్గులకు బుద్ధి చెప్పడం వల్ల పెయింటర్‌కు పట్టిన సోమేశ్వరం సుశీల అనే అబద్ధపు దయ్యం కూడా నిష్క్రమిస్తుంది. ఊరంతా హాయిగా ఊపిరి పీల్చుకోడమే కాదు ఆ ఒంటరి అమ్మాయిని తమ ఊరికి కోడలి గా తెచ్చుకుంటుంది. రాజ్‌ బి.శెట్టి నిర్మాతగా కొత్త దర్శకుడు జె.పి.తుమినాడ్‌ తీసిన కన్నడ చిత్రం ‘సు ఫ్రమ్‌ సో’ బలమైన సందేశాన్ని విపరీతమైన హాస్యంతో, జనం సెంటిమెంట్లతో, మూఢత్వాన్ని తెలివినీ మానవత్వాన్ని జోడించి చెప్పడం వల్ల ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. జూలై 25న విడుదలై ఇప్పటికి 125 కోట్లు సంపాదించింది. ఖర్చు పెట్టింది 5 కోట్లే! 

ఒంటరిగా ఉన్న స్త్రీ అంటే మగాడికి ఎందుకు లోకువ. వితంతువు, పెళ్లి కాని స్త్రీ, విడాకులు పొందిన స్త్రీ, పెళ్లి వద్దనుకున్న స్త్రీ... ఈమె తన మానాన తాను బతుకుదామనుకుంటే ఆమెను వేధించడానికి దయ్యాల్లా ఎందుకు వెంటపడతారు. ఆమె లోబరుచుకోవడానికి ఎంత పాశవికంగానైనా ఎందుకు ప్రయత్నిస్తారు? మానవత్వం లేని ఇలాంటి మగాళ్లు దయ్యాల కంటే భయానకమైన వాళ్లు అని దర్శకుడు చెప్పడం జనానికి బాగా నచ్చింది. మగాళ్లు దయ్యాలుగా మారవద్దని, సంస్కారమనే రక్షను వాళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుందాం. ఈ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌ తెలుగులో కూడా ఉంది.                    

ఒంటరి స్త్రీ మర్యాదగా బతుకుదామంటే దయ్యాల్లా మగాళ్లు పీక్కుతింటున్నారని ఆ అమ్మాయి కష్టాలు వింటే తెలుస్తుంది. పెయింటర్‌కు పట్టిన దయ్యం కంటే ఈ అమ్మాయి చుట్టూ ఉన్న దయ్యాలను ఒదిలించడమే ముఖ్యమని భావించింది ఆ ఊరు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement