సెలబ్రిటీ రైటర్స్‌ | World Book Day on April 23: Books written by movie celebrities | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీ రైటర్స్‌

Apr 23 2025 1:54 AM | Updated on Apr 23 2025 1:54 AM

World Book Day on April 23: Books written by movie celebrities

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం 

మూవీ సెలబ్రిటీల ఆట, మాట, పాట మనకు తెలుసు. మరి అక్షరం? ... ఈ పుస్తకాలే సాక్ష్యం. మూవీ సెలబ్రిటీలు రాసిన ఈ పుస్తకాల్లో మచ్చుకు కూడా కాలక్షేప కథనాలు లేవు. స్త్రీ సాధికారత నుంచి మానసిక ఆరోగ్యం వరకు విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి.

ప్రయాణంలో ప్రతి అడుగు పాఠమే: ప్రియాంక చోప్రా
‘అన్‌ఫినిష్డ్‌: ఏ మెమోయిర్‌’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. ఈ పుస్తకం తన జ్ఞాపకాల సమాహారం. తాను నడిచొచ్చిన దారి.‘నేను ఎప్పటినుంచో పుస్తకం రాయాలనుకుంటున్నాను. అయితే ఎప్పుడు రాయాలనేదే సమస్య. నా జీవితం గురించి రాయడానికి ఇది సరిౖయెన సమయం కాదు.

ఇంకా ప్రయాణం పూర్తి కాలేదు అనుకుంటాం. అయితే జీవితంలో గొప్ప పాఠాలు ప్రయాణంలోనే బోధించడతాయి. వాటి గురించి పంచుకోవడం అవసరం. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అందుకే కలం పట్టుకున్నాను. నా జ్ఞాపకాలను అన్‌ఫినిష్డ్‌ ద్వారా పాఠకులతో పంచుకున్నాను’ అంటుంది ప్రియాంక చోప్రా.

డిజిటల్‌ యుగంలో పిల్లల పెంపకం: సోనాలి బింద్రే
‘బంగారు కళ్ల బుచ్చమ్మ’గా ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సోనాలి బింద్రే ‘బర్డ్స్‌ అండ్‌ బీస్ట్స్‌: ఎన్‌చాంటింగ్‌ టేల్స్‌ ఆఫ్‌ ఇండియా’ ‘ది మోడ్రన్‌ గురుకుల్‌’ పుస్తకాలు రాసింది. ఆమె తాజా పుస్తకం ‘ఏ బుక్‌ ఆఫ్‌ బుక్స్‌’ నేడు విడుదల అవుతోంది. ‘బర్డ్స్‌ అండ్‌ బీస్ట్స్‌’ పుస్తకంలో భారతీయ జానపద కథలను తనదైన శైలిలో తిరిగి చెప్పింది సోనాలి. లడఖ్, అస్సాం, తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాఖండ్‌లలో తాను విన్న మౌఖిక జానపద కథలకు అక్షర రూపం ఇచ్చింది. పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే పుస్తకం ఇది.

ఒకప్పుడు సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్‌ కుటుంబాలే కనిపిస్తున్నాయి. ‘ఈ డిజిటల్‌ యుగంలో పిల్లలను ఎలా పెంచాలి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘ది మోడ్రన్‌ గురుకుల్‌’ పుస్తకం రాసింది సోనాలీ. పిల్లల పెంపకానికి సంబంధించి మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ఇక తాజా పుస్తకం ‘ఏ బుక్‌ ఆఫ్‌ బుక్స్‌’ పుస్తకాలకు సంబంధించి సమస్త విషయాల గురించి మాట్లాడుతుంది. పుస్తకాలు ఎందుకు చదవాలి? ఉపయోగం ఏమిటి? ఎలాంటి పుస్తకాలు చదవాలి?... మొదలైన విషయాలతో ‘జీవితాంతం రీడర్‌గా ఉండాలి’ అని చెబుతుంది ఏ బుక్‌ ఆఫ్‌ బుక్స్‌.

తరాల మధ్య అంతరం: ట్వింకిల్‌ ఖన్నా
‘మిసెస్‌ ఫన్నీ బోన్స్‌’ ‘పైజామాస్‌ ఆర్‌ ఫర్‌ గీవింగ్‌’ ‘ది లెజెండ్‌ ఆఫ్‌ లక్ష్మిప్రసాద్‌’  ‘వెల్‌కమ్‌ పారడైజ్‌’ పుస్తకాలతో రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకుంది ట్వింకిల్‌ ఖన్నా. ‘పాఠకులకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. ఇలా జరిగింది తెలుసా? అంటూ నాకు తెలిసిన విషయాలను పాఠకులతో పంచుకుంటాను’ అంటున్న ట్వింకిల్‌ దయాదక్షిణ్యాలు, ఒంటరితనం,  తరాల మధ్య అంతరాలు వంటి ఇతివృత్తాలతో రచనలు చేసింది.

‘నేను రాయడానికి కూర్చున్నప్పుడు ఇతివృత్తం గురించి ఆలోచించను. నా కథలు హితబోధ చేస్తున్నట్లు ఉండకుండా జాగ్రత్త పడతాను. ఐడియా మదిలో మెరవగానే కథ పూర్తికాదు. కథ ఎక్కడ మొదలవుతుందో చెప్పలేము. అది మైండ్‌లో తనకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటుంది. కొన్నిసార్లు మనల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళుతుంది’ అంటుంది ట్వింకిల్, ‘జెల్లీ స్వీట్స్‌’ అనే కథ రాయడానికి ఆమెకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది!

తల్లులు, కాబోయే తల్లుల కోసం...: కరీనా కపూర్‌
ప్రెగ్నెన్సీ సమయంలో తన శారీరక, భావోద్వేగ అనుభవాలకు ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పుస్తకంతో అక్షర రూపం ఇచ్చింది కరీనా కపూర్‌. ఐవీఎఫ్‌ మదర్స్, ప్రెగ్నెన్సీ డిప్రెషన్, వికారం, మార్నింగ్‌ సిక్‌నెస్, పిల్లలకు పాలు ఇవ్వడం... ఇలా ఎన్నో విషయాల గురించి తన పుస్తకంలో రాసింది. ఈ పుస్తకం తన వ్యక్తిగత జ్ఞాపకాలు మాత్రమే అనలేము. ఎక్స్‌పెక్టింగ్‌ మదర్స్‌కు ఎంతో ఉపయోగపడే పుస్తకం. ‘ఈ పుస్తకం నా మూడవ సంతానం’ అని నవ్వుతూ అంటుంది కరీనా.

రోషెల్‌ పింటోతో కలిసి ‘ది స్టైల్‌ డైరీ ఆఫ్‌ ఎ బాలీవుడ్‌ దివా’ అనే పుస్తకం కూడా రాసింది కరీనా కపూర్‌.‘ఆటోబయోగ్రఫీ రాయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కాదు’ అని పుస్తక ఆవిష్కరణ సభలో చెప్పింది. ఆటోబయోగ్రఫీకి ముందు ఆమె నుంచి మరిన్ని పుస్తకాలను ఆశించవచ్చు.

జెండర్‌ ఈక్వాలిటీ... దయా గుణం... పర్యావరణం: అలియా భట్‌
‘ఎడ్‌ ఫైండ్స్‌ ఎ హోమ్‌’ పుస్తకంతో రచయిత్రిగా మంచి మార్కులు తెచ్చుకుంది అలియా భట్‌. పిల్లల కోసం రాసిన పుస్తకం ఇది. పర్యావరణం, దయాగుణం, లింగ సమానత్వం... ఇలాంటి ఎన్నో విషయాల గురించి పుస్తకంలో రాసింది. బాల పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని రాసింది.

‘పిల్లలకు ప్రకృతిపై ప్రేమ కలిగేలా చేయడానికి, పర్యావరణ పరిరక్షణ బాధ్యత గురించి తెలియజెప్పడానికి ఈ పుస్తకం రాశాను. ఇంట్లో కంటే ఆరుబయట ఎక్కువ సమయం గడపడానికి, సహజ ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించడానికి పిల్లలను ్రపోత్సహించడానికి మొదటి అడుగుగా ఈ పుస్తకం రాశాను’ అంటుంది అలియా భట్‌.

పింపుల్స్‌ నుండి పీరియడ్స్‌ వరకు...: టిస్కా చోప్రా
యాక్టర్, డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న టిస్కా చోప్రా రైటర్‌ కూడా. తమ శరీరంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడాని 9 నుంచి 13 ఏళ్ల బాలికల కోసం ‘వాట్స్‌ అప్‌ విత్‌ మీ?’ పుస్తకం రాసింది. యుక్త వయస్సు సమస్యలు, పీరియడ్స్, మొటిమలు... ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. యుక్తవయసులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి యువతకు సహాయపడే పుస్తకం ఇది. 

‘తొమ్మిదేళ్ల నుంచి 13, 14 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని వాట్స్‌ అప్‌ విత్‌ మీ రాశాను. తల్లులే కాదు తండ్రులు కూడా నా పుసక్తంలో భాగం కావాలని కోరుకున్నాను. మార్కెట్లో లభించే ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్‌ల గురించి తెలియజేశాం. పాఠం చెబుతున్నట్లుగా కాకుండా వినోదాత్మకంగా ఉండేలా పుస్తకం రాశాను’ అంటుంది టిస్కా చోప్రా.

Advertisement
 
Advertisement
Advertisement