గుండెను గుచ్చే అందమైన ముల్లు | beauty treatments a threat to heart health and trigger cardiac arrests | Sakshi
Sakshi News home page

గుండెను గుచ్చే అందమైన ముల్లు

Jul 4 2025 6:27 AM | Updated on Jul 4 2025 1:12 PM

 beauty treatments a threat to heart health and trigger cardiac arrests

‘కాంటా లగా’ మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్‌ నటి షెఫాలీ జరీవాలా బ్యూటీ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఓ ఇంజెక్షన్‌ తీసుకున్న కొద్దిసేపటికే కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతిచెందిన సంఘటన ఇటీవల చాలా సంచలనం రేపింది. షెఫాలీ అనేక ఏళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోజు ఆమె ఉపవాసంలో ఉండి...  ఇంజెక్షన్‌ తీసుకున్నందున ఇలా జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా  నటీనటులతో పాటు ఇతరులు తీసుకునే  బ్యూటీ చికిత్సలనూ అలాగే... గుండెపై వాటి ప్రభావాలను చూద్దాం...

‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం’ అంటూ తెలుగు కవులు వినిపించారూ... వివరించారు. అందం ఆనందాన్నిస్తుంది. దానికి ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాలా అన్నది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు బ్యూటీ చికిత్సలో జరిగేదేమిటి, వాటి పర్యవసానాలేమిటి, గుండెపైన వాటి ప్రభావాలేమిటో తెలుసుకుందాం. మొదట్లో సినీతారలు... తర్వాత్తర్వాత క్రమంగా బాగా ధనవంతులు మొదలు...  నేడు సామాన్యుల వరకూ సౌందర్య కాంక్ష చేరింది. ఇప్పుడు పార్లర్‌కు వెళ్లడమన్నది మధ్యతరగతీ, దిగువ మధ్యతరగతికీ సాధారణమైంది. మెరుస్తున్న మేని నిగారింపు, యూత్‌ఫుల్‌ లుక్‌తో కనిపించడం అందరికీ ఇష్టమైన అంశమైంది. బ్యూటీ థెరపీ లేదా ఈస్థటిక్‌ ట్రీట్‌మెంట్‌ అని పిలిచే సౌందర్య చికిత్సల్లో రక్తనాళం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించే గ్లుటాథియోన్‌ డ్రిప్స్‌ మొదలుకొని రకరకాల మీసోథెరపీ (మీసో థెరపీ అంటే చర్మంలో ఉండే మూడు పొరల్లోని మధ్యపొరపై ప్రభావం చూపేవి) మందులూ, కొలాజెన్‌ ΄ పౌడర్లు, చర్మం నిగారింపుతో ఫెయిర్‌గా కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు, పైపూతగా వాడే క్రీములు, ΄ పౌడర్లు... ఇలా రకరకాల ట్రీట్‌మెంట్లు ఉంటాయి. పైకి మిలమిలా మెరుస్తూ ఉండే చర్మం వెనక కొన్ని నల్లటి చిక్కటి చీకటి రహస్యాలూ ఉంటాయి. కొన్నింటిపైన ఓ మేరకు నియంత్రణలు ఉన్నప్పటికీ... మరికొన్నింటి విషయంలో అసలు ఎలాంటి అదుపూ లేకుండా ఏమాత్రం శిక్షణ లేనివారూ, తమకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనివారూ చేసేవి కూడా ఉంటాయన్నది ఓ నగ్న సత్యం.

 ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్‌
 

బ్యూటీ చికిత్సల్లో ఎన్నెన్నో  రకాలు... 
వ్యక్తులు అందంగా కనిపించేందుకు చేసే చికిత్సల్లో పలు రకాలైనవి ఉంటాయి. ఉదాహరణకు... 
→ పెరుగుతున్న వయసు ఛాయలు చర్మంపై కనిపించకుండా... ముడుతలూ, లోతైన గీతలు కనిపించకుండా చేసేందుకు యాంటీ ఏజింగ్‌ చికిత్సగా బొటాక్స్‌ ఇంజెక్షన్లు,  ఇతర డర్మల్‌ ఫిల్లర్స్‌ 
→ మార్కెట్‌లో యాంటీ ఏజింగ్‌ మందులు, డీ–టాక్స్‌ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా పిలుస్తూ... రక్తనాళం ద్వారా రక్తంలోకి మందును ఎక్కించే గ్లుటాథియోన్, నికొటినెమైడ్‌ అడినైన్‌ డైన్యూక్లియోటైడ్‌ (ఎన్‌ఏడీ+) మందులు 
→ రక్తంలోని  ప్లాస్మాను వేరు చేసి చర్మంలోకి ఎక్కించే పీఆర్‌పీ (ప్లేట్‌లెట్‌ రిచ్‌  ప్లాస్మా)  థెరపీ, (జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే గ్రోత్‌ ఫ్యాక్టర్‌ కాన్సంట్రేట్‌ (జీఎఫ్‌సీ) చికిత్స,  ఎగ్జోసోమ్స్, చర్మాన్ని ఉత్తేజితం చేసే పాలీ డైయాక్సీ రైబో న్యూక్లియోటైడ్‌  (పీడీఆర్‌ఎన్‌) వంటి చికిత్సలు 
→ కొలాజెన్‌ పెపై్టడ్స్, బయోటిన్, చర్మాన్ని తెల్లగా మార్చే గుట్లాథియోన్‌ లాంటి పిల్స్‌తో పాటు కొన్ని హార్మోన్‌ థెరపీలు. ఇవన్నీ ఆహారంలోని సప్లిమెంట్స్‌ కాగా... వీటిలో కొన్నింటిని నోటిద్వారా (ఓరల్‌గా) ఇస్తారు 
→ ఇక పైపూత లేపనాలు (టాపికల్‌)గా వాడే పెపై్టడులూ, రెటినాయిడ్స్‌ ఉండే క్రీములు... ఇవి సౌందర్య ఔషధ రూపాల్లో ఇస్తుండటం వల్ల వీటిని ‘కాస్మస్యూటికల్స్‌’గానూ చెబుతారు.

మన దేశంలోఅనుమతిఉన్నవి కొన్నే...
మన దేశంలో ఇలాంటి మందులకు అనుమతి ఇచ్చే అత్యున్నత అథారిటీ ‘సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ – సీడీఎస్‌సీఓ) అనే సంస్థ. దీనితో పాటు  అమెరికన్‌ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతించిన వాటిని మనదేశంలోనూ అనుమతిస్తుంటారు. వాటిల్లో కొన్నింటికే అనుమతులున్నాయి 
→ ఉదాహరణకు రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్, హై–డోస్‌ విటమిన్‌ సి, ఎన్‌ఏడీ+ లేదా మరికొన్ని మిశ్రమ మందులు (కాక్‌టెయిల్స్‌)కు పై సంస్థల అనుమతి లేదు → చర్మంలో ఉండే మూడు పొరల్లో మధ్యపొరపై పనిచేసే మరికొన్ని చికిత్సలను ‘ఎక్సోజోమ్‌ బేస్‌డ్‌’ చికిత్సలు అంటారు. వీటితో పాటు స్టెమ్‌సెల్‌ థెరపీల వంటివాటిని శిక్షణ పొందిన క్వాలిఫైడ్‌ నిపుణులు అందిస్తేనే సురక్షితం.

ప్రమాదాలూ / అనర్థాలు ఎప్పుడంటే... 
ముందుగా చెప్పిన ప్రకారం... అత్యంత సుశిక్షితులూ, అన్ని విధాలా తగిన విద్యార్హతలు ఉన్న డర్మటాలజిస్టుల వంటి నిపుణులు మాత్రమే ఈ చికిత్సలను అందించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం చాలాచోట్ల అనధికారిక సెలూన్లు, స్పాలు ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల ఇళ్లలో కూడా అనధికారికంగా ఈ ఔషధాలనూ,  ఇవ్వకూడని సప్లిమెంట్లను ఇస్తున్నారు. పైగా ఇళ్లలో ఇచ్చే ఈ చికిత్సల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే... వాటి పర్యవసానాలేమిటీ, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న పరిజ్ఞానం  అనర్హులైన చికిత్సకులకు ఉండదూ, అలా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులూ ఉండవు. అయినప్పటికీ చాలామంది వీటిని యధేచ్ఛగా ఇస్తున్నారూ... అలాగే అందంపై ఆసక్తి ఉన్న యువతీయువకులు తీసుకుంటున్నారు.

చదవండి: క్యాషియర్‌ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుక్కుంటే నేరమా బాస్‌?!

ఇవీ నమోదైన (డాక్యుమెంటెడ్‌) ప్రమాదాలు / అనర్థాలు 
→ అలర్జిక్‌ రియాక్షన్లు, అనాఫిలాక్సిస్‌ అనర్థాలు (అదుపు చేయలేని విధంగా చాలా తక్కువ వ్యవధిలో వచ్చే తీవ్రమైన రియాక్షన్లు వీటి ద్వారా ఒక్కోసారి షాక్‌ కూడా కలిగితే దాన్ని అనాఫిలెక్టిక్‌ షాక్‌గా కూడా వ్యవహరిస్తారు). ఈ రియాక్షన్లు అరుదుగా  ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలు లేక΄ోలేదు 
→ రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్‌ ఇంజెక్షన్లతో అనాఫిలెక్టిక్‌ షాక్, అసెప్టిక్‌ మెనింజైటిస్‌ (మెదడు, వెన్నుపాములో ఉండే పొరల వాపు) వంటివి చాలా అరుదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి రియాక్షన్స్‌ కనిపించిన దాఖలాలు ఉన్నాయి 
→ హై–డోస్‌ విటమిన్‌ బి కాంప్లెక్స్‌ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అవి వికటించి, ప్రాణాంతకంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి చాలాకాలం నిల్వ చేయడానికి అందులో వాడే ప్రిజర్వేటివ్స్‌ వల్ల ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి 
→ కొన్ని సందర్భాల్లో బ్యూటీ మందులు వాడాక ఇన్ఫెక్షన్లు, రక్తానికి ఇన్ఫెక్షన్‌ (సెప్సిస్‌)  కనిపించాయి 
→ స్టెమ్‌ సెల్‌ చికిత్సల్లో కొంతమేరకు కనిపించే ముప్పు (రిస్క్‌)
→ స్టెమ్‌సెల్స్‌తో చేసే చికిత్సల్లో ఇమ్యూన్‌ రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ముప్పు ఉన్నందున నిజానికి బ్యూటీ చికిత్సల్లో స్టెమ్‌సెల్స్‌కు అనుమతి లేదు.

ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు... 
→ బ్యూటీ చికిత్స అందించేవారికి వాస్తవంగా ఆ అర్హత ఉందా, వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి → చాలా త్వరగా ప్రభావం చూపుతాయన్న ‘క్విక్‌ ఫిక్స్‌ మార్కెటింగ్‌’ ప్రచారాలను నమ్మడం సరికాదు. మెల్లగా వచ్చే ప్రభావాలే దీర్ఘకాలం నిలుస్తాయి. ఇవి చాలావరకు నిరపాయకరమని గుర్తించాలి 
→ ఆ సౌందర్యసాధనాలకూ, ఉత్పాదనలకు ఎఫ్‌డీఏ లేదా సీడీఎస్‌సీవో సంస్థల ఆమోదం ఉందా అని చూడాలి
→ గ్లుటాథియోన్‌ వంటి మందులు ఇచ్చే సమయంలో అది నిరపాయకరమైన మోతాదులోనే ఉందా అని చూడాలి. అంటే వారానికి 600 నుంచి 1200 ఎంజీకి మించి మందు తీసుకోకూడదు. (అనర్థాలు సంభవించిన కొన్ని కేసులను చూసినప్పుడు కొందరు అవసరమైన మోతాదుకు ఐదు రెట్లు ఇచ్చిన దాఖలాలనూ గుర్తించారు) 
చివరగా... అందం చాలా ఆకర్షణీయమైదే. అందరూ కోరుకునేదే. అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ప్రాణాలు కాకూడదు. అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా జీవించి ఉండటం ముఖ్యం.

ఎందుకీ అనర్థాలు... 
ఈ అనర్థాలకు చాలా కారణాలు ఉంటాయి. 
→ చట్టపరంగా వీటిని అదుపు చేసే యంత్రాంగం కొరవడటం 
→ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి  ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఈ తరహా క్లినిక్‌లూ, చికిత్సల గురించి విపరీత ప్రచారం 
→ ఏమాత్రం అర్హతా, పర్యవసానాలపై అవగాహన లేని అనర్హులు చికిత్సలందించడం. 

అన్నిటికంటే ముఖ్యంగా వినియోగ దారుల్లో కొరవడిన అవగాహన : 
ఈ ఉత్పాదనల విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన లేక΄ోవడం వల్ల కూడా ఈ తరహా అనర్థాలు  చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ‘స్వాభావికమైన, ప్రకృతిసిద్ధమైన (నేచురల్‌)’ వంటి మాటలు ఉపయోగించినప్పుడు అవేవీ ప్రమాదకరం కానివిగా భావిస్తూ చాలామంది ప్రమాదకరమైన సింథసైడ్‌ రసాయనాలనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.

వసతులన్నీ హాస్పిటల్స్‌లోనే... 
బ్యూటీ చికిత్సలు తీసుకునే సమయంలో అది పెద్ద హాస్పిటల్‌ అయి ఉండటం, ఎమర్జెన్సీ సౌకర్యాలూ కలిగి ఉండేలా చూసుకోవడం ముప్పును తప్పిస్తుంది. వాస్తవానికి రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్‌ వంటివి తగిన మోతాదులో ఇచ్చినప్పుడు గుండె΄ోటు రావడం, గుండె ఆగి΄ోవడం (కార్డియాక్‌ అరెస్ట్‌), అనాఫిలెక్టిక్‌ షాక్‌కు గురికావడం వంటి సందర్భాలు చాలా అరుదు. అయితే అన్ని వసతులూ, ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రితో తగిన విద్యార్హతలూ, చికిత్స అర్హతలూ కలిగిన డాక్టర్ల ఆధ్వర్యంలో బ్యూటీ చికిత్సలు తీసుకుంటే... ఒకవేళ ఏవైనా రియాక్షన్స్, అనాఫిలెక్టిక్‌ రియాక్షన్స్‌ వచ్చినా తక్షణం చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడటానికి అవకాశముంటుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement