breaking news
Shefali Jariwala
-
గుండెను గుచ్చే అందమైన ముల్లు
‘కాంటా లగా’ మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఓ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందిన సంఘటన ఇటీవల చాలా సంచలనం రేపింది. షెఫాలీ అనేక ఏళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోజు ఆమె ఉపవాసంలో ఉండి... ఇంజెక్షన్ తీసుకున్నందున ఇలా జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా నటీనటులతో పాటు ఇతరులు తీసుకునే బ్యూటీ చికిత్సలనూ అలాగే... గుండెపై వాటి ప్రభావాలను చూద్దాం...‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం’ అంటూ తెలుగు కవులు వినిపించారూ... వివరించారు. అందం ఆనందాన్నిస్తుంది. దానికి ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాలా అన్నది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు బ్యూటీ చికిత్సలో జరిగేదేమిటి, వాటి పర్యవసానాలేమిటి, గుండెపైన వాటి ప్రభావాలేమిటో తెలుసుకుందాం. మొదట్లో సినీతారలు... తర్వాత్తర్వాత క్రమంగా బాగా ధనవంతులు మొదలు... నేడు సామాన్యుల వరకూ సౌందర్య కాంక్ష చేరింది. ఇప్పుడు పార్లర్‌కు వెళ్లడమన్నది మధ్యతరగతీ, దిగువ మధ్యతరగతికీ సాధారణమైంది. మెరుస్తున్న మేని నిగారింపు, యూత్‌ఫుల్ లుక్‌తో కనిపించడం అందరికీ ఇష్టమైన అంశమైంది. బ్యూటీ థెరపీ లేదా ఈస్థటిక్ ట్రీట్మెంట్ అని పిలిచే సౌందర్య చికిత్సల్లో రక్తనాళం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించే గ్లుటాథియోన్ డ్రిప్స్ మొదలుకొని రకరకాల మీసోథెరపీ (మీసో థెరపీ అంటే చర్మంలో ఉండే మూడు పొరల్లోని మధ్యపొరపై ప్రభావం చూపేవి) మందులూ, కొలాజెన్ ΄ పౌడర్లు, చర్మం నిగారింపుతో ఫెయిర్‌గా కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు, పైపూతగా వాడే క్రీములు, ΄ పౌడర్లు... ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. పైకి మిలమిలా మెరుస్తూ ఉండే చర్మం వెనక కొన్ని నల్లటి చిక్కటి చీకటి రహస్యాలూ ఉంటాయి. కొన్నింటిపైన ఓ మేరకు నియంత్రణలు ఉన్నప్పటికీ... మరికొన్నింటి విషయంలో అసలు ఎలాంటి అదుపూ లేకుండా ఏమాత్రం శిక్షణ లేనివారూ, తమకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనివారూ చేసేవి కూడా ఉంటాయన్నది ఓ నగ్న సత్యం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ బ్యూటీ చికిత్సల్లో ఎన్నెన్నో రకాలు... వ్యక్తులు అందంగా కనిపించేందుకు చేసే చికిత్సల్లో పలు రకాలైనవి ఉంటాయి. ఉదాహరణకు... → పెరుగుతున్న వయసు ఛాయలు చర్మంపై కనిపించకుండా... ముడుతలూ, లోతైన గీతలు కనిపించకుండా చేసేందుకు యాంటీ ఏజింగ్ చికిత్సగా బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర డర్మల్ ఫిల్లర్స్ → మార్కెట్లో యాంటీ ఏజింగ్ మందులు, డీ–టాక్స్ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా పిలుస్తూ... రక్తనాళం ద్వారా రక్తంలోకి మందును ఎక్కించే గ్లుటాథియోన్, నికొటినెమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ+) మందులు → రక్తంలోని ప్లాస్మాను వేరు చేసి చర్మంలోకి ఎక్కించే పీఆర్పీ (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా) థెరపీ, (జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (జీఎఫ్‌సీ) చికిత్స, ఎగ్జోసోమ్స్, చర్మాన్ని ఉత్తేజితం చేసే పాలీ డైయాక్సీ రైబో న్యూక్లియోటైడ్ (పీడీఆర్ఎన్) వంటి చికిత్సలు → కొలాజెన్ పెపై్టడ్స్, బయోటిన్, చర్మాన్ని తెల్లగా మార్చే గుట్లాథియోన్ లాంటి పిల్స్‌తో పాటు కొన్ని హార్మోన్ థెరపీలు. ఇవన్నీ ఆహారంలోని సప్లిమెంట్స్ కాగా... వీటిలో కొన్నింటిని నోటిద్వారా (ఓరల్‌గా) ఇస్తారు → ఇక పైపూత లేపనాలు (టాపికల్)గా వాడే పెపై్టడులూ, రెటినాయిడ్స్ ఉండే క్రీములు... ఇవి సౌందర్య ఔషధ రూపాల్లో ఇస్తుండటం వల్ల వీటిని ‘కాస్మస్యూటికల్స్’గానూ చెబుతారు.మన దేశంలోఅనుమతిఉన్నవి కొన్నే...మన దేశంలో ఇలాంటి మందులకు అనుమతి ఇచ్చే అత్యున్నత అథారిటీ ‘సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్సీఓ) అనే సంస్థ. దీనితో పాటు అమెరికన్ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతించిన వాటిని మనదేశంలోనూ అనుమతిస్తుంటారు. వాటిల్లో కొన్నింటికే అనుమతులున్నాయి → ఉదాహరణకు రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్, హై–డోస్ విటమిన్ సి, ఎన్ఏడీ+ లేదా మరికొన్ని మిశ్రమ మందులు (కాక్టెయిల్స్)కు పై సంస్థల అనుమతి లేదు → చర్మంలో ఉండే మూడు పొరల్లో మధ్యపొరపై పనిచేసే మరికొన్ని చికిత్సలను ‘ఎక్సోజోమ్ బేస్డ్’ చికిత్సలు అంటారు. వీటితో పాటు స్టెమ్‌సెల్ థెరపీల వంటివాటిని శిక్షణ పొందిన క్వాలిఫైడ్ నిపుణులు అందిస్తేనే సురక్షితం.ప్రమాదాలూ / అనర్థాలు ఎప్పుడంటే... ముందుగా చెప్పిన ప్రకారం... అత్యంత సుశిక్షితులూ, అన్ని విధాలా తగిన విద్యార్హతలు ఉన్న డర్మటాలజిస్టుల వంటి నిపుణులు మాత్రమే ఈ చికిత్సలను అందించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం చాలాచోట్ల అనధికారిక సెలూన్లు, స్పాలు ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల ఇళ్లలో కూడా అనధికారికంగా ఈ ఔషధాలనూ, ఇవ్వకూడని సప్లిమెంట్లను ఇస్తున్నారు. పైగా ఇళ్లలో ఇచ్చే ఈ చికిత్సల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే... వాటి పర్యవసానాలేమిటీ, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న పరిజ్ఞానం అనర్హులైన చికిత్సకులకు ఉండదూ, అలా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులూ ఉండవు. అయినప్పటికీ చాలామంది వీటిని యధేచ్ఛగా ఇస్తున్నారూ... అలాగే అందంపై ఆసక్తి ఉన్న యువతీయువకులు తీసుకుంటున్నారు.చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!ఇవీ నమోదైన (డాక్యుమెంటెడ్) ప్రమాదాలు / అనర్థాలు → అలర్జిక్ రియాక్షన్లు, అనాఫిలాక్సిస్ అనర్థాలు (అదుపు చేయలేని విధంగా చాలా తక్కువ వ్యవధిలో వచ్చే తీవ్రమైన రియాక్షన్లు వీటి ద్వారా ఒక్కోసారి షాక్ కూడా కలిగితే దాన్ని అనాఫిలెక్టిక్ షాక్‌గా కూడా వ్యవహరిస్తారు). ఈ రియాక్షన్లు అరుదుగా ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలు లేక΄ోలేదు → రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ ఇంజెక్షన్లతో అనాఫిలెక్టిక్ షాక్, అసెప్టిక్ మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాములో ఉండే పొరల వాపు) వంటివి చాలా అరుదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి రియాక్షన్స్ కనిపించిన దాఖలాలు ఉన్నాయి → హై–డోస్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అవి వికటించి, ప్రాణాంతకంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి చాలాకాలం నిల్వ చేయడానికి అందులో వాడే ప్రిజర్వేటివ్స్ వల్ల ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి → కొన్ని సందర్భాల్లో బ్యూటీ మందులు వాడాక ఇన్ఫెక్షన్లు, రక్తానికి ఇన్ఫెక్షన్ (సెప్సిస్) కనిపించాయి → స్టెమ్ సెల్ చికిత్సల్లో కొంతమేరకు కనిపించే ముప్పు (రిస్క్)→ స్టెమ్‌సెల్స్‌తో చేసే చికిత్సల్లో ఇమ్యూన్ రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉన్నందున నిజానికి బ్యూటీ చికిత్సల్లో స్టెమ్‌సెల్స్‌కు అనుమతి లేదు.ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు... → బ్యూటీ చికిత్స అందించేవారికి వాస్తవంగా ఆ అర్హత ఉందా, వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి → చాలా త్వరగా ప్రభావం చూపుతాయన్న ‘క్విక్ ఫిక్స్ మార్కెటింగ్’ ప్రచారాలను నమ్మడం సరికాదు. మెల్లగా వచ్చే ప్రభావాలే దీర్ఘకాలం నిలుస్తాయి. ఇవి చాలావరకు నిరపాయకరమని గుర్తించాలి → ఆ సౌందర్యసాధనాలకూ, ఉత్పాదనలకు ఎఫ్‌డీఏ లేదా సీడీఎస్‌సీవో సంస్థల ఆమోదం ఉందా అని చూడాలి→ గ్లుటాథియోన్ వంటి మందులు ఇచ్చే సమయంలో అది నిరపాయకరమైన మోతాదులోనే ఉందా అని చూడాలి. అంటే వారానికి 600 నుంచి 1200 ఎంజీకి మించి మందు తీసుకోకూడదు. (అనర్థాలు సంభవించిన కొన్ని కేసులను చూసినప్పుడు కొందరు అవసరమైన మోతాదుకు ఐదు రెట్లు ఇచ్చిన దాఖలాలనూ గుర్తించారు) చివరగా... అందం చాలా ఆకర్షణీయమైదే. అందరూ కోరుకునేదే. అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ప్రాణాలు కాకూడదు. అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా జీవించి ఉండటం ముఖ్యం.ఎందుకీ అనర్థాలు... ఈ అనర్థాలకు చాలా కారణాలు ఉంటాయి. → చట్టపరంగా వీటిని అదుపు చేసే యంత్రాంగం కొరవడటం → యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ తరహా క్లినిక్లూ, చికిత్సల గురించి విపరీత ప్రచారం → ఏమాత్రం అర్హతా, పర్యవసానాలపై అవగాహన లేని అనర్హులు చికిత్సలందించడం. అన్నిటికంటే ముఖ్యంగా వినియోగ దారుల్లో కొరవడిన అవగాహన : ఈ ఉత్పాదనల విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన లేక΄ోవడం వల్ల కూడా ఈ తరహా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ‘స్వాభావికమైన, ప్రకృతిసిద్ధమైన (నేచురల్)’ వంటి మాటలు ఉపయోగించినప్పుడు అవేవీ ప్రమాదకరం కానివిగా భావిస్తూ చాలామంది ప్రమాదకరమైన సింథసైడ్ రసాయనాలనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.వసతులన్నీ హాస్పిటల్స్‌లోనే... బ్యూటీ చికిత్సలు తీసుకునే సమయంలో అది పెద్ద హాస్పిటల్ అయి ఉండటం, ఎమర్జెన్సీ సౌకర్యాలూ కలిగి ఉండేలా చూసుకోవడం ముప్పును తప్పిస్తుంది. వాస్తవానికి రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ వంటివి తగిన మోతాదులో ఇచ్చినప్పుడు గుండె΄ోటు రావడం, గుండె ఆగి΄ోవడం (కార్డియాక్ అరెస్ట్), అనాఫిలెక్టిక్ షాక్‌కు గురికావడం వంటి సందర్భాలు చాలా అరుదు. అయితే అన్ని వసతులూ, ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రితో తగిన విద్యార్హతలూ, చికిత్స అర్హతలూ కలిగిన డాక్టర్ల ఆధ్వర్యంలో బ్యూటీ చికిత్సలు తీసుకుంటే... ఒకవేళ ఏవైనా రియాక్షన్స్, అనాఫిలెక్టిక్ రియాక్షన్స్ వచ్చినా తక్షణం చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడటానికి అవకాశముంటుంది. -
కాంతా లగా ఫేమ్ ఆకస్మిక మరణం.. ఆమెను తలచుకుని భర్త ఎమోషనల్!
'కాంతా లగా' అనే పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (Shefali Jariwala). 2002లో వచ్చిన ఈ పాటతోనే మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్‌తో యూత్‌కు దగ్గరైంది. కానీ ఊహించని విధంగా ఆమె ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా ఆమె మరణాన్ని తలచుకుని భర్త పరాగ్ త్యాగి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన భార్యతో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు.పరాగ్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'షెఫాలి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతావు. నువ్వు ఒక నమ్మకమైన స్నేహితురాలు, నా ప్రియమైన భార్య. నువ్వు మా అందరిని అమ్మలా చూసుకున్నావ్. ఎల్లప్పుడూ ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే నువ్వు గొప్ప అంకితభావం గల వక్తి. కేవలం ఆప్యాయతగల భార్య మాత్రమే కాదు.. సింబాకు అద్భుతమైన తల్లివి కూడా. నువ్వు ప్రేమించిన వారి వెంట నిలిచే నమ్మకమైన స్నేహితురాలివి. అందుకే షెఫాలి గుర్తింపునకు అర్హురాలు. ఆమె ప్రజలను అలరించిన విధానం మరిచిపోలేనిది. ఇప్పుడు మనతో లేకపోయినా తన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేం. శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ ఎమోనషల్ అయ్యారు. కాగా.. ఆమె మరణం తర్వాత ఐదు రోజులకు షెఫాలీ జరివాలా జ్ఞాపకార్థం ముంబయిలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. View this post on Instagram A post shared by Parag Tyagi (@paragtyagi) -
Shefali Jariwala: గ్లూటాతియోన్, విటమిన్ సీ ఇంజెక్షన్లు అంత ఖరీదా..?
గత కొన్ని రోజులుగా, నటి-మోడల్ షెఫాలి జరివాలా అకాల మరణం రకరకాల ప్రశ్నలకు తెరలేపింది. ప్రాథమిక దర్యాప్తులో కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుందనే అనుమాతనం తోపాటు ఆమె గదిలోనే అవన్ని దొరకడం మరింత అనుమానాలకు ఊతమిచ్చింది. దీంతో అందం వ్యామోహం ఖరీదు ప్రాణామా..అని సర్వత్ర చర్చలు మొదలయ్యాయి. పైగా యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు గ్లూటాతియోన్, విటమిన్ సీల ఖరీదు ఎంతుంటుందనే ఆరాలు కూడా మొదలయ్యాయి. ఇంతకీ ఆ కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సలకు ఎంత ఖర్చు అవుతుందంటే..? నటి మోడల్ షెఫాలి గత ఎనిమిదేళ్లుగా ఈ మందులు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ఇంటి నుంచి యాంటీ-ఏజింగ్ మాత్రలు, మల్టీవిటమిన్లు, గ్లూటాతియోన్ ఇంజెక్షన్ల నిల్వలు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రయోజనాలు..భారత్‌లో గ్లూటాతియోన్, విటమిన్సీ ఇంజెక్షన్లకు భారీ డిమాండ్ ఉన్నట్లు నివేదికల్లో తేలింది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడం, పిగ్మెంటేషన్ నిరోధించడం, వృద్ధాప్యా సంకేతాలను దరిచేరనీయకుండా చేయడం వంటి ప్రయోజనాల రీత్యా టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో మార్కెట్లో అమ్ముడవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో దీని విలువ ఏడాదికి సుమారు రూ. 2 వేల కోట్లుగా ఉండగా, అది 2032 నాటికి రూ.5 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. వెద్య నిపుణుల ప్రకారం..దీర్ఘకాలికంగా వినియోగించడం వల్ల పలు దుష్పరిణాముల తప్పవనేది సమాచారం. ఒక్కోసారిగా ప్రాణంతకంగా కావొచ్చని కూడా చెబుతున్నారు వైద్యులు.ఈ చికిత్సల ఖరీదు..ఈ కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ చికిత్సలు వాళ్లు ఎంచుకున్న సెషన్లు ఆధారంగా ఉంటాయట. ఒక్కో సెషెన్ రూ. 5 వేల నుంచి 7 వేల వరకు చార్జ్ చేస్తారట. అంటే 5 సెషన్ల ప్యాకేజ్ దాదాపు రూ. 60 వేలు ఖర్చు అవుతుందట. కొంతమంది వీటిని టాబ్లెట్ల రూపంలో తీసుకుంటారట. ఇలా అయితే గనుక ప్రామాణికంగా 30 ప్యాక్‌లు వినియోగిస్తారట. అంటే ప్యాక్‌కి 15 ఉంటాయట. వాటి ధర రూ. 5,000. అంటే 30 ప్యాక్‌లకు రూ. 7,800 ఖర్చవుతుందని సమాచారం. అయితే మరికొందరూ ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండానే స్వీయంగా తీసుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులునిపుణులు ఏమంటున్నారంటే..చర్మ వ్యాధి నిపుణులు ఈ చికిత్సలు ప్రమాదకరం అని, ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా తీసుకోవడం మరింత ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి నిపుణులు అందుబాటులోలేని బ్యూటీ సెలూన్లో అందిస్తుండటం బాధకరమని అన్నారు. ఇవి గనుక ప్రతిచర్యలకు దారితీస్తే చర్మ సమస్యల తోపాటు గుండె లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, యువత గ్లామర్ వెంటపడి ఈ ప్రమాదకరమైన ఫెయిర్‌నెస్ చికిత్సలు తీసుకునిప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు.(చదవండి: అందం ముఖ్యమే.. కానీ, ఆ బలహీనతకు లొంగిపోకూడదు!) -
యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?
కాంటా లగా గర్ల్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) అకాల మరణం అనేక ఊహాగానాలు, ఆందోళనలను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా యాంటీ-ఏజింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ఫాస్టింగ్ టాక్సిక్ కాక్టెయిల్ ఆమె ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.షెఫాలిఖాళీ కడుపుతో కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకొని ఉండవచ్చని, ఇదే గుండెపోటుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న షెఫాలి ఖాళీ కడుపుతో గ్లూటాతియోన్ , విటమిన్ సి కలిగిన కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారనీ, ఆ వెంటనే ఆమె తీవ్ర అస్వస్తతతకు గురైందట. ఒళ్లు వణకడం, తర్వాత స్పృహ కోల్పోవడంతో తక్షణమే ఆమె భర్త పరాగ్ త్యాగి ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతేకాదు షెఫాలీ ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరకడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అంతే కాదు ఎనిమిదేళ్ల క్రితం వైద్యుడిని సంప్రదించిన షెఫాలీ, ఆ తర్వాత కూడా స్వయంగా మందులు తీసుకోవడం ప్రారంభించి, ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణ లేకుండానే దీనిని కొనసాగించిందనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఇంట్రావీనస్గా తీసుకోవడం లేదా ఇతర మందులతో పాటు తీసుకోవడం వంటివి - హైపోటెన్షన్ , కార్డియాక్ అరెస్ట్‌లాంటి ముప్పు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. షెఫాలీ విషయంలో కూడా ఖాళీ కడుపుతో ఇంజక్షన్ తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణపై ఇంకా స్పష్టతలేదు. పోస్ట్‌మార్టం నివేదిక తరువాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.గ్లుటాతియోన్, విటమిన్ సి చర్మ చికిత్సలలో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పటికీ ఖాళీకడుపుతో లేదా ఉపవాసం ఉన్న స్థితిలో, ఇలాంటి మందుల కలయిక హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని, ఒక్కోసారి రక్తపోటు పడిపోయి గుండె ఆగిపోవడానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంతటా యాంటీ-ఏజింగ్ థెరపీల వాడకంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా, ఇంజెక్ట్ చేయగల గ్లూటాతియోన్‌కు FDA-ఆమోదం లేదనీ, వాస్తవానికి, చర్మాన్ని తెల్లగా చేస్తుందని భావిస్తున్న గ్లూటాతియోన్ ఇంజెక్షన్ ఫలితాలపై క్లినికల్ ట్రయల్స్గానీ, లేదా అధికారిక మార్గదర్శకాలు లేవు. పైగా దీని వలన కాలేయం, మూత్రపిండాలు , నాడీ వ్యవస్థపై విషపూరిత ప్రభావంతో పాటు, స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన ప్రమాదాలను కూడా FDA లేవనెత్తింది. అలాగే చర్మకాంతికోసం ఇంజెక్టబుల్ విటమిన్ సి ఉత్పత్తులకు కూడా FDA-ఆమోదం లేదు. 2019లో, FDA అన్ని కంపెనీలను ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి) ఇంజెక్షన్ అనుమతి లేని వెర్షన్ల పంపిణీని నిలిపివేయాలని కోరింది. మరోవైపు భారతదేశంలో, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) గ్లూటాతియోన్ , విటమిన్ సి ఇంజెక్షన్ల వినియోగానికి ఆమోదం తెలిపింది. కానీ సౌందర్య లేదా చర్మాన్ని తెల్లగా చేసే ఉద్దేశానికి ఎంతమాత్రం కాదు నిర్దిష్ట వైద్య సూచనల కోసం మాత్రమే.కోవిడ్ తరువాత ఇటు దేశంలో, ఆటు ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో మరణానికి హృదయనాళ వ్యాధి (CVD) ప్రధాన కారణంగా నిలుస్తోందని రొమ్ము కేన్సర్ తరువాత ఇదే అత్యంత ప్రమాదకారిగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. -
షఫాలీ మరణానికి కారణం.. ఉపవాసం సమయంలో అలాంటి ఇంజెక్షనే!
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (42) (Shefali Jariwala) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్‌తో మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్‌తో యూత్‌కు దగ్గరైంది. జూన్ 27న కార్డియాక్ అరెస్ట్‌తో ఆమె మరణించినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ముంబై పోలీసులు ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే, తాజాగా ఆమె మరణం పట్ల పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది.నటి షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు విచారణ ప్రారంభించి, ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల కారణం గురించి వారు ఇంకా వెళ్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. షెఫాలి చాలా సంవత్సరాలుగా వృద్ధాప్య వ్యతిరేక (యాంటీ ఏజింగ్) ఇంజెక్షన్లు తీసుకుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె అందుకు సంబంధించిన మెడిసిన్స్‌తో పాటు ఇంజెక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన రోజున శుక్రవారం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో.. ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని సమాచారం. దీంతో ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్‌కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడంతో కార్డియాక్ అరెస్టై ఉంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని సంఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్ట్‌మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం నిర్ధారించబడుతుందని పోలీసులు తెలిపారు. జూన్ 29న, షెఫాలి భౌతికకాయాన్ని ఓషివారా శ్మశానవాటికలో దహనం చేశారు. ఆమె భర్త పరాగ్ త్యాగి అంత్యక్రియలు చేస్తుండగా విలపిస్తూ కనిపించారు. తొలుత గాయకుడు హర్మీత్ సింగ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు. -
గుండె పోటు కాదు.. 42 ఏళ్ల నటి మృతిపై అనుమానాలు!
‘కాంటా లగా’ఫేం, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా(42) మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియాంక చోప్రా, లారదత్తాతో పాటు పలువుడు బాలీవుడ్ తారలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆధారలేవి లేవని, మృతికి ఇంకా కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే.. శుక్రవారం రాత్రి షెఫాలి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను అంథేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. అమె కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు తొలుత వార్తల వచ్చాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.పోలీసులు ఏం చెబుతున్నారంటే.. షఫాలీ మృతిపై తాజాగా ముంబై పోలీసులు అప్డేట్ ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ప్రస్తుతం అనుమానాస్పద ఘటనగానే పరిగణలోకి తీసకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మాకు సమాచారం వచ్చింది. అంధేరీలోని షఫాలి నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించాం. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో పని చేస్తున్న వారిని, వంట మనిషిని ప్రశిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అనుమానస్పద ఘటనగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని ముంబై పోలీసులు తెలిపారు.రీమిక్స్ సాంగ్‌తో ఫేమస్.. 2002లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్‌తో ఫేమస్ అయింది షెఫాలి. ఈ గుర్తింపుతోనే సినిమా అవకాశాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగా చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం పలు టీవీ రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 13లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొని అలరించింది. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్‌ని వివాహం చేసుకుంది. 2009లో అతనితో విడాకులు తీసుకొని.. 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది.