
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (42) జూన్ 27న మరణించింది. చిన్న వయసులోనే భార్య తనను వదిలి వెళ్లడంతో నటుడు పరాగ్ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియల సమయంలోనూ భార్య మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించాడు. రోజులు గడిచేకొద్దీ భార్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతున్నాడే తప్ప ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇంతలోనే వారి పెళ్లి రోజు వచ్చింది.

వెడ్డింగ్ యానివర్సరీ
ఇద్దరి ప్రేమ బంధానికి 15 ఏళ్లు. కానీ, ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి భార్య లేకుండా పోయింది. అయినా సరే.. పరి (షెఫాలీని ప్రేమగా పిల్చుకునే పేరు) కోసం ఇదే నా గిఫ్ట్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. పంటికింద నొప్పిని భరిస్తూ భార్య ఫోటోను ఎదపై భద్రంగా పదిలపర్చుకున్నాడు.
ప్రేమకు పదేళ్లు
'తను నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరంలోని అణువణువునా తనే ఉంది. ఇప్పుడది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది' అని వీడియోకిచ్చిన క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నీ ప్రేమను చూస్తుంటే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. షెఫాలీ జరివాలా, పరాగ్ త్యాగి.. 2010 ఆగస్టు 12న తొలిసారి కలుసుకున్నారు. కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. 2014లో వీరు కలుసుకున్న ఆగస్టు 12వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. ఇది షెఫాలీకి రెండో పెళ్లి. గతంలో ఆమె హర్మీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోగా 2009లో విడాకులిచ్చింది.