చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్‌లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్‌లోని మిడిల్‌సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.
దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్‌కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.
వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్‌లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
రెండేళ్ల క్రితం స్వస్థలానికి..
అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్‌లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్‌లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్‌లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు.
చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!
సంతాప ప్రకటన
వైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్‌సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.


