
ఆ ఊర్లో ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ లాంటి లగ్జరీ కార్లు కనిపిస్తాయి. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 11 బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో ఊరి జనమంతా కలిసి 1000 కోట్ల రూపాయలకు పైగా దాచుకున్నారు. జనానికి కావాల్సిన సదుపాలయాన్నీ ఆ ఊరిలో ఉన్నాయి. అయితే ఇదేదో సిటీ అనుకుంటున్నారా? కానేకాదు పక్కా పల్లెటూరు. విలేజ్‌లో ఇంటికో విలాసవంతమైన కారు ఎలా అబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? మరి అదే ఆ గ్రామం ప్రత్యేకత.
మనం చెప్పుకోబోయే గ్రామం పేరు ధర్మజ్. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉంది. మన దేశంలో అత్యంత ధనిక గ్రామంగా, ఎన్నారై విలేజ్‌గా ఆఫ్ ఇండియాగానూ (NRI Village of India) ప్రసిద్ధికెక్కింది. సగటు పల్లెలకు భిన్నంగా ధర్మజ్ సక్సెస్ సాధించడం వెనుక చాలా పెద్ద ప్రయాణమే ఉంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా సొంతూరిని మరిచిపోకపోకుండా ఉండడమే ఈ ఊరి విజయ రహస్యం. ఇక్కడి నుంచి పలు దేశాలకు వలసవెళ్లిన వారు పంపించిన సొమ్ములతో ధర్మజ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
అలా మొదలైంది..
ధర్మజ్ గ్రామ విజయయాత్ర 1895లో మొదలైంది. ఈ గ్రామం మొదటి తరానికి జోతారామ్ కాశీరామ్ పటేల్ చతుర్భాయ్ పటేల్ ఉగాండా దేశానికి వలసవెళ్లి మార్గదర్శకులుగా నిలిచారు. తర్వాత నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లడం క్రమంగా పెరిగింది. జోతారామ్, చతుర్భాయ్ తర్వాత ప్రభుదాస్ పటేల్ వంటి వారు మాంచెస్టర్‌కు వెళ్లి స్థిరపడ్డారు. గోవింద్ భాయ్ పటేల్ ఒక అడుగు ముందుకేసి యెమెన్‌లోని పోర్ట్‌సిటీ ఆడెన్‌లో పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ధర్మజ్ నుంచి విదేశాలకు వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. ఎంతగా అంటే అక్కడి కుటుంబాల్లో సగానికిపైగా విదేశాల్లోనే ఉండేంతగా. తాజా గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో 1700, అమెరికాలో 800, కెనడాలో 300, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్‌లో 150 కుటుంబాలు నివసిస్తున్నట్టు అంచనా. ఆఫ్రికాతో పాటు మిగతా దేశల్లోనూ చాలా కుటుంబాలు ఉన్నాయి.
ప్రపంచ దేశాలకు వలస వెళ్లిన వాళ్లంతా తమ మూలాలను మర్చిపోకుండా తమ గ్రామాభివృద్ధి బాటలు వేయడమే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న ప్రవాసులను 2007లో ఏకతాటిపైకి తీసుకువచ్చి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడంతో ధర్మజ్ (Dharmaj) రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఊరంతా విశాలమైన సిమెంట్ రోడ్లతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ.. ప్రతి గ్రామస్థుడు పాటించేలా చేస్తున్నారు. యువత, పెద్దల కోసం సువిశాలమైన పార్క్ ఉంది. ఇందులో తక్కువ ధరకే ఈత కొలను, బోటింగ్ చేయొచ్చు. గ్రామంలో పశువుల మేత కోసం ప్రత్యేకంగా 50 బిఘాల భూమిని కేటాయించారు.
11 బ్యాంకులు.. వెయ్యి కోట్లు
11,333 మంది జనాభాతో 17 హెక్టార్లలో విస్తరించి ధర్మిజ్ గ్రామం ఆర్థిక విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఊరిలోని 11 బ్యాంకుల్లో రూ. 1000 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. 1959, డిసెంబర్ 18న దేనా బ్యాంక్ మొదటి శాఖను ఇక్కడ ప్రారంభమైంది. దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ధర్మజ్ గ్రామ వాసి హెచ్ఎం పటేల్ (HM Patel) వ్యవస్థాపక అధ్యక్షతన 1969, జనవరి 16న గ్రామ సహకార బ్యాంకు ఏర్పాటైంది. విదేశాల్లో స్థిరపడిన ధర్మజ్ వాసులు సొంతూరికి డబ్బులు పంపిస్తుండటంతో ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ బాగా పుంజుకుంది. అలాగే ఊరి ప్రజల జీవనశైలి కూడా మెరుగుపడింది. ధర్మజ్ రోడ్లపై ఇప్పుడు మెర్సిడెస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు చక్కర్లు కొట్టడం సర్వసాధారణ విషయం. అక్కడ ఇళ్లు కూడా వివిధ దేశాల శైలిని ప్రతిబింబిస్తుంటాయి.
గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మ గాంధీ. ఆర్థిక పరిపుష్టి, పౌరుల సంపూర్ణ మద్దతు ఉంటే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయడానికి ధర్మజ్ ప్రత్యక్ష నిదర్శనం. డబ్బులు పంపి చేతులు దులుపుకోవడమమే కాదు ప్రతిఏడాది జన్మభూమికి వస్తుంటారు విదేశాల్లోని ధర్మజ్ వాసులు. ప్రతి సంవత్సరం జనవరి 12న నిర్వహించే ధర్మజ్ దివస్‌కు (Dharmaj Diwas) పెద్దసంఖ్యలో హాజరవుతారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. అనుభూతులను పంచుకుంటారు. అభివృద్ధి గురించి చర్చిస్తారు.
ధర్మజ్ అంటే కేవలం డబ్బు ఉన్న గ్రామం మాత్రమే కాదు. గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్ కలిసి ఎంతటి విజయం సాధించగలవో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ.