
కుటుంబ సభ్యులతో గాయత్రి
ఉన్నతవిద్య అభ్యసించడానికి వారికి పరిస్థితులు అనుకూలించలేదు.. సంప్రదాయ విద్యను కొనసాగించే అవకాశమూ ఆ కుటుంబ సభ్యులకు కలగలేదు. కుటుంబ స్థితిగతుల నేపథ్యంలో చిరు ఉద్యోగంలో చేరి ఆ తర్వాత వివాహం, భార్య, పిల్లలు పోషణతో చదువుకు దూరమైన ఓ వ్యక్తి పట్టుదలగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. అంతే కాకుండా భార్య, పిల్లలను కూడా అదే వర్సిటీలో ఉన్నత చదువులు చదివించారు. ఒకే కుటుంబంలోని (entire family) ఐదుగురి ఉన్నత విద్యకు అంబేడ్కర్ వర్సిటీ ఆలంబనగా నిలిచింది. ఇదీ ఓ సార్వత్రిక కుటుంబం కథ. వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన ఎస్.శ్రీధర్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో (TTD Board) చిరు ఉద్యోగి. కుటుంబ స్థితిగతులు కొంత మెరుగయ్యాక అంబేడ్కర్ సార్వత్రిక విద్యాలయంలో డిగ్రీలో చేరి ఉత్తీర్ణులయ్యారు. శ్రీధర్ బాటలో భార్య ఉమాదేవి కూడా పయనించి డిగ్రీ పట్టభద్రులయ్యారు.
కుమారుడు కార్తీక్ కూడా అదే వర్సిటీ నుంచి ఎం.కామ్ పూర్తి చేసి అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. పెద్ద కుమార్తె ఎస్.విద్య కూడా సార్వత్రిక విద్యాలయం నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేశారు. చిన్న కుమార్తె గాయత్రి కూడా ఈ వర్సిటీ నుంచే ఎం.కామ్ (M.Com) చదివి బంగారు పతకానికి ఎంపికైంది. కుటుంబ సభ్యులందరికీ అంబేడ్కర్ సార్వత్రిక విద్యాలయం బాసటగా నిలిచి వారి పురోగతికి దోహదపడింది.
లక్ష్యసాధనలో వెనుకడుగు వేయొద్దు..
లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వెనుకడుగు వేయవద్దని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బంగారు పతక గ్రహీత ఎస్.గాయత్రీ అన్నారు. వర్సిటీ తిరుపతి అధ్యయన కేంద్రంలో ఎం.కామ్‌లో అత్యధిక మార్కులు సాధించడంతో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రయోజిత బంగారు పతకానికి (Gold Medal) ఆమె ఎంపికైంది. బుధవారం జూబ్లీహిల్స్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమెకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పతకాన్ని అందించారు.
చదవండి: గ్రూప్ 1 ఉద్యోగాల్లో 66 శాతం మంది వారే!