ఏయూ దూరవిద్యలో మాస్ కాపీయింగ్
కూటమి పాలనలో దిగజారుతున్న ప్రమాణాలు
మార్చి–ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ
నిర్వహణలో అడుగడుగునా లోపాలు
విశాఖ కొత్తవలసలోని వాగ్దేవి కళాశాలలో భారీగా మాస్ కాపీయింగ్
అప్పట్లో పరీక్ష కేంద్రాన్ని మూసివేసిన ఏయూ అధికారులు
పరీక్షలను రద్దు చేయకుండా తీరిగ్గా ఇప్పుడు మూల్యాంకనం
ఆ ఒక్క సెంటర్‌లోని జవాబు పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు వ్యక్తులతో దిద్దిస్తున్న దూరవిద్య డైరెక్టర్
రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలే కారణమని విమర్శల వెల్లువ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. శతాబ్ది వేడుకల వేళ ఏయూ ఘనకీర్తి అభాసుపాలవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన దూరవిద్య కేంద్రంలో ప్రస్తుతం పారదర్శకత కొరవడింది. పరీక్షపత్రాల ముద్రణ, పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో అధికారులు నిబంధనలను కాలరాస్తున్నారు. ఫలితంగా అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
ఏడాదికి రెండు సార్లు దూరవిద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, వాటిని సవ్యంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఐఐటీ నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని వైస్ చాన్సలర్‌గా నియమించామని గొప్పలు పోయిన చంద్రబాబు సర్కారు విద్యా ప్రమాణాలను దారుణంగా దిగజారుస్తోంది.
పరీక్షలు ఎందుకు రద్దు చేయలేదు?
ఏయూ దూరవిద్యలో భాగంగా ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో ఒకసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో పరీక్షలు పెట్టగా కొత్తవలసలోని వాగ్దేవి కళాశాలలో భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగింది. దీంతో ఆ కళాశాల సెంటర్‌ను మూసివేసి పక్కన ఉన్న ప్రగతి కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని మార్చారు. అయితే, వాగ్దేవి సెంటర్‌లో జరిగిన పరీక్షలను రద్దు చేయకుండా ఇప్పుడు తాపీగా మూల్యాంకనం జరిపి ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధపడడం అనుమానాలకు తావిస్తోంది.
ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రలోభాలకు ఏయూ అధికారులు లొంగిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం చేసేవారికి ఆ పేపర్ ఏ సెంటర్ నుంచి వచి్చంది? ఎవరు రాశారు అనే వివరాలు లేకుండా కోడింగ్, డీకోడింగ్ పద్ధతిలో చేపడతారు. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా మాస్ కాపీయింగ్ చేసిన సెంటర్‌లోని పరీక్ష పత్రాలను ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయిస్తుండటంతో అవి ఏ సెంటర్‌లోనివో, అక్కడి రాసిన విద్యార్థులు ఎవరో సమాచారం బహిరంగ రహస్యంగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది.
ఇలాంటప్పుడు ఆ ఫలితాల పారదర్శకతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం దూరవిద్యలోని ప్యానల్ నామినేట్ చేసిన వ్యక్తులు మాత్రమే చేయాలి. ఈ లిస్టును వీసీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇక్కడ సైకాలజీ పేపర్లను ప్రైవేటు కళాశాలలకు చెందిన లెక్చర్లతో గుట్టుచప్పుడు కాకుండా మూల్యాంకనం చేయిస్తుండటం గమనార్హం. ఇక్కడే, కనీస నియమాలను పాటించకుండా దూరవిద్య డైరెక్టర్ ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో వర్సిటీ ఖ్యాతి దిగజారిపోతోంది.
మార్చిన పరీక్ష కేంద్రంలోనూ కాపీయింగ్!
ఇదిలా ఉంటే వాగ్దేవి పరీక్ష కేంద్రం నుంచి ప్రగతి కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని మార్చినా మాస్ కాపీయింగ్ ఆగట్లేదు. నవంబర్ నుంచి జరుగుతున్న దూరవిద్య పరీక్షల్లోనూ మరోసారి మాస్ కాపీయింగ్ కలకలం సృష్టించింది. ఏయూ దూరవిద్య కేంద్రంలో సుమారు 1400 మందికిపైగా పరీక్ష రాసే వసతి అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్‌సీ వంటి దూరవిద్య పరీక్షలు ఏయూ కేంద్రంలోనే పారదర్శకంగా జరిగేవి. అలాంటి కేంద్రాన్ని పట్టించుకోని అధికారులు ప్రైవేటు కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.


