
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమాల్ మాట్లాడుతూ తమ 'సీనియర్' ఉద్యోగులకు వ్యక్తిగత పనితీరు ఆధారంగా అధిక వేరియబుల్ వేతనం మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు.
మునుపటి త్రైమాసికాల్లో చెల్లించిన దానితో పోలిస్తే కంపెనీ ఇప్పుడు అధిక త్రైమాసిక బోనస్ లేదా వేరియబుల్ పే (variable pay) కాంపోనెంట్ చెల్లిస్తుందని కున్నుమాల్ భరోసా ఇచ్చారు. అలాగే 'జూనియర్' స్థాయి ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనం కాంపోనెంట్ ఇస్తోందని, దీనిని రాబోయే త్రైమాసికాల్లోనూ కొనసాగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
"ఇది(వేరియబుల్ పే) మా సంస్థలో ఉన్న త్రైమాసిక బోనస్‌కు అర్హులైన వారందరినీ కవర్ చేస్తుంది. బహుశా కొత్తగా చేరిన వారు మినహా... కానీ ఇది ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కరినీ కవర్ చేస్తుంది. సాధారణంగా, జూనియర్ స్థాయిలో మేము 100 శాతం చెల్లిస్తాము. ఇది కొనసాగుతుంది. అలాగే సీనియర్లకు కూడా ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తాము. ఇది వ్యక్తిగత, యూనిట్ పనితీరు ఆధారంగా ఉంటుంది "అని టీసీఎస్ సీహెచ్ఆర్ఓ పేర్కొన్నారు.