అనేక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అందించే దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. మరో క్లిష్టమైన సామాజిక సమస్యకు ఐటీ పరిష్కారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా యూరప్‌లోనే అతిపెద్ద స్వతంత్ర పరిశోధనాభివృద్ధి సంస్థ సింటెఫ్‌తో చేతులు కలిపింది.
ప్రస్తుత రోజుల్లో వయసు పైబడిన పెద్దవారిని చూసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. పిల్లలు తమ ఉద్యోగాలు, వృత్తి రీత్యా ఎక్కడో ఉంటున్నారు. దీంతో వయసు మళ్లిన వృద్ధులు ఇంట్లో ఒంటరిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలో తమను పట్టించుకునేవారు లేరని ఇలు పెద్దవారు, తమవారి బాగోగులను పర్యవేక్షించే అవకాశం ఉండటం లేదని వారి పిల్లలు మథనపడుతుంటారు.
ఈ సమస్యకు సులువైన పరిష్కారాన్ని అందిస్తూ.. వృద్ధుల సంరక్షణను సరికొత్తగా మార్చే లక్ష్యంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి టీసీఎస్.. యూరప్‌లోని అతిపెద్ద స్వతంత్ర పరిశోధనా సంస్థలలో ఒకటైన సింటెఫ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
ఈ భాగస్వామ్యం సింటెఫ్ స్మార్ట్ ఇన్‌క్లూజివ్ లివింగ్ ఎన్విరాన్మెంట్స్ (SMILE) ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడుతుంది. ఇది ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్ సాయంతో ఇళ్లలో వృద్ధుల సంరక్షణను, పర్యవేక్షించడానికి, సహకారం ఇవ్వడానికి ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్‌ను ఏకీకృతం చేస్తుంది.
ఒంటరిగా ఉంటూ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు దూరంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు, సంరక్షకులు, తమ ఇతర వయో వృద్ధులతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉంటూ ఇంట్లో తమంతట తాము స్వతంత్రంగా, సురక్షితంగా జీవించేందుకు సహాకారం అందించేలా స్మైల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.
స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించి, ఇది రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. రానున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి సకాలంలో సంరక్షకులకు సమాచారం అందిస్తుంది.


