భారత్-కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న దౌత్యపరమైన స్తబ్ధత వీడనుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగవ్వనున్నాయి. ఈ దేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్-CEPA) పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా చర్చలు ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కీలక పర్యటనలు - సన్నాహక చర్చలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరిలో కెనడాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా చర్చలకు పచ్చజెండా ఊపనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనధికారికంగా సన్నాహక చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే కెనడా కూడా పరస్పర రాయితీలతో కూడిన ఒక బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని రంగం సిద్ధం చేస్తోంది.
మార్క్ కార్నీ రాకతో మారిన సమీకరణాలు
2023 సెప్టెంబర్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం విషయంలో జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే, 2025 మార్చిలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఇటీవల జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన భేటీ ఈ ఒప్పందానికి పునాది వేసింది.
50 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యం
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై (భారతీయ వస్తువులపై 50% వరకు) భారీ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో భారత్-కెనడా ఒప్పందం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కెనడా ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ 13, 2025 నుంచి జనవరి 27, 2026 వరకు ఈ ఒప్పందంపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది.
రాజకీయ ఉద్రిక్తతలను పక్కన పెట్టి ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా భారత్, కెనడాలు ముందుకు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో పీయూష్ గోయల్ పర్యటనతో ఈ ఒప్పందం పట్టాలెక్కితే అది రెండు దేశాల వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాల్లోని ఎగుమతిదారులకు ఊరటనిస్తుంది.
ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం


