ప్రపంచంలో కొన్ని ఊళ్లు కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఇదే క్రమంలో చైనాలోని ఒక చిన్న గ్రామం ప్రస్తుతం ఆన్ లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఊరు విధిస్తున్న వింత జరిమానాలు, వసూలు చేస్తున్న విచిత్ర పన్నులే ఇందుకు కారణం. పెళ్లికీ, పిల్లలకూ పెనాల్టీలు వసూలు చేయడంపై ఆ గ్రామం తీవ్ర విమర్శలకు గురవుతోంది.
నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని లింకాంగ్ గ్రామంలో వివాదం చెలరేగింది. 'విలేజ్ రూల్స్: ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్' అనే పేరుతో ఆ గ్రామానికి సంబంధించిన పెనాల్టీల నోటీసుల ఫొటోలు నెటిజన్లు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాహం, గర్భం, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన వివిధ జరిమానాలను నోటీసులో వివరించడం ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారితీసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.
ఫొటోలలో చూపించిన నోటీసు ప్రకారం.. యునాన్ ప్రావిన్స్ వెలుపల ఉన్న వ్యక్తిని ఆ గ్రామస్తులు వివాహం చేసుకుంటే 1,500 యువాన్ల జరిమానా విధిస్తారు. పెళ్లికి ముందే గర్భవతి అయిన మహిళలు 3,000 యువాన్లు జరిమానా చెల్లించాలి. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే జంటలకు ఏటా 500 యువాన్లు చొప్పున పన్ను కట్టాలి.
ఇక పెళ్లయిన 10 నెలల్లోపు బిడ్డను కంటే 3 వేల యువాన్ల జరిమానా విధించనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అలాగే చీటికీమాటికీ పోట్లాడుకునే మొగుడూపెళ్లాలకూ పెనాల్టీ తప్పదు. భార్యభర్తలు తగువులాడుకుంటే గ్రామ పెద్దలు పంచాయితీ చేస్తారు. ఇరువురికీ చెరో 500 యువాన్లు జరిమానా విధిస్తారు.
మద్యం మత్తులో వీరంగం సృష్టించే మందుబాబులకూ ఇక్కడ పెనాల్టీలు ఉన్నాయి. గ్రామంలో ఇలా ఎవరైనా చేస్తే వారికి 3,000 నుండి 5,000 యువాన్ల మధ్య జరిమానా విధిస్తారు. అలాగే అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసినా 500 నుండి 1,000 యువాన్ల జరిమానా ఎదుర్కొంటారు.
ఈ లింకాంగ్ గ్రామం జనాభా లేదా ఆర్థిక స్థితికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆ నోటీసు చాలా అసాధారణంగా ఉందని స్థానిక మెంగ్డింగ్ టౌన్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి రెడ్ స్టార్ న్యూస్ తో మాట్లాడుతూ చెప్పారు. తమను సంప్రదించకుండానే గ్రామ కమిటీ సొంతంగా ఆ నోటీసును పోస్ట్ చేసిందని, తర్వాత దాన్ని తొలగించినట్లు ఆ అధికారి తెలిపారు.


