ఒక టీసీఎస్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాలుగేళ్లకు పైగా పనిచేసిన తనకు ఈ సంవత్సరం నెలకు కేవలం రూ.422 ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చిందని అతను పేర్కొన్నారు. “టీసీఎస్ నాకు 4 సంవత్సరాల తర్వాత రూ.422 పెంపు ఇచ్చింది..” అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.
2021లో కంపెనీలో చేరినట్లు పేర్కొన్న రెడిటర్ .. “ఇది నా చెడు నిర్ణయాల ఫలితం” అని పేర్కొంటూ, తాను సపోర్ట్ ప్రాజెక్ట్‌లో పనిచేశానని, అక్కడ “జీరో లెర్నింగ్, జీరో గ్రోత్, అంతులేని అరుపులు, మైక్రోమేనేజ్మెంట్” ఉండేదని రాసుకొచ్చారు. తన పెంపు ఆరు నెలల ఆలస్యంగా వచ్చిందని, ఈ పరిస్థితుల్లో టీసీఎస్ వంటి సంస్థలు “పల్లీలు కొనుక్కునే చెల్లింపులు” ఇస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన “మీ విలువ తెలుసుకోండి” అని టీసీఎస్ ఉద్యోగులు, ఫ్రెషర్లకు సూచించారు.
వైరల్గా మారిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విస్తృతంగా స్పందించారు. ‘ఇంక్రిమెంట్ దారుణంగా ఇవ్వడంతో నేను 7 సంవత్సరాల తర్వాత టీసీఎస్ వీడాను’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ సంవత్సరం తనకు జీరో హైక్ వచ్చిందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “ఐటీని విడిచిపెట్టడం ఉత్తమ మార్” అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇక టీసీఎస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. “వ్యక్తిగత కేసులపై మేం వ్యాఖ్యానించం. కానీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నవి అవాస్తవాలు” అని టీసీఎస్ ప్రతినిధి పేర్కొన్నారు. “సెప్టెంబర్ 1 నుంచి మా ఉద్యోగుల 80% మందికి వేతన సవరణలు అమలయ్యాయి. సగటు ఇంక్రిమెంట్ 4.5% నుంచి 7% మధ్య ఉంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపు ఇచ్చాం” అని తెలిపారు


