
ఆదిపూజలు అందుకునే వినాయకుడికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. పురాతన ఆలయాల్లో విలక్షణమైన వినాయక విగ్రహాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యంత అరుదైన ఆలయాలు, విలక్షణమైన విగ్రహాలు ఉన్నాయి. అలాంటి అరుదైన ఆలయాలు, విగ్రహాల విశేషాలు
మీ కోసం...
వినాయకుడిని భక్తులు గజాననుడిగానే ఆరాధిస్తారు. వినాయకుడు మానవ ముఖంతో కనిపించే ఏకైక ఆలయం తమిళనాడులోని తిలతర్పణపురిలో ఉంది. పార్వతీదేవి నలుగుపిండితో రూపొందించిన వినాయకుడు లక్షణంగా మానవముఖంతోనే ఉండేవాడు. తనను అడ్డగించినందుకు శివుడు కోపగించి, అతడి తలను నరికేసి, ఆ తర్వాత జరిగిన పొరపాటుకు చింతించి గజముఖాన్ని అతికించిన పురాణ కథ అందరికీ తెలిసినదే!
గజాననుడిగా మారక ముందు బాలవినాయకుడి రూపంలో కొలువుతీరిన ఆలయం ఇది. వినాయకుడి తొలి రూపం ఇదే గనుక దీనికి ఆదివినాయక ఆలయంగా పేరు వచ్చింది. ఈ ఆలయం తిలతర్పణపురిలోని ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇది క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శ్రీరాముడు ఇదేచోట తన తండ్రి దశరథుడికి పితృశ్రాద్ధం నిర్వహించి, తిల తర్పణాలు సమర్పించాడనే కథనం కూడా ఉంది. అందువల్ల ఇది కాశీ, రామేశ్వరాలతో సమానమైన పుణ్యక్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు.
ఐశ్వర్య గణపతి
కలువా వినాయకుడుఅత్యంత భారీ ఏకశిలా విగ్రహం ఇది. ఆరుబయట పంట పొలాల మధ్య ఉన్న ఈ విగ్రహానికి ఆలయమేదీ లేదు. భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. ఐశ్వర్య గణపతిగా కొలువు తీరిన ఈ ఏకశిలా విగ్రహం తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 7.62 మీటర్లు. పీఠంతో కలుపుకొంటే, దీని ఎత్తు 9.14 మీటర్లు. ఈ విగ్రహం పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. సుమారు క్రీస్తుశకం పన్నెండో శతాబ్దిలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఉంటారని
అంచనా.
అడవీయ గణపతి
పురాతనమైన ఈ ఏకశిలా గణపతి విగ్రహం శ్రీలంకలోని ఉడుదుంబరలో ఉంది. అడవులకు రక్షణగా ఉంటాడని భావించి, ఈ విగ్రహాన్ని నెలకొల్పడం వల్ల ఈ గణపతికి ‘అడవీయ గణపతి’ అనే పేరు వచ్చింది. ఇది సుమారు పన్నెండో శతాబ్ది నాటిదని అంచనా.
స్థానిక గిరిజన తెగ నాయకుడికి వినాయకుడు కలలో కనిపించడంతో ఆయన ఈ విగ్రహాన్ని నెలకొల్పాడని స్థానికుల కథనం. దీని ఎత్తు 6 మీటర్లు. ఇది ప్రపంచంలోని అతి ఎత్తయిన వినాయక విగ్రహాలలో మూడవ స్థానంలో నిలుస్తుంది. శ్రీలంకలోని హిందువులే కాకుండా, విదేశీ పర్యాటకులు కూడా ఈ విగ్రహాన్ని సందర్శించుకుంటూ ఉంటారు.
త్రినేత్ర గణపతి
వినాయకుడి తండ్రి పరమశివుడు ముక్కంటి అని అందరికీ తెలుసు. మూడు కన్నులతో వినాయకుడు కొలువుదీరిన అరుదైన ఆలయం రాజస్థాన్‌లో ఉంది. రణథాంబోర్ కోట ప్రాంగణంలో ఉన్న ఈ త్రినేత్ర గణపతి ఆలయం క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నాటిది. రణథాంబోర్ కోటను కేంద్రంగా చేసుకుని పాలించిన రాజు హమీర్ వినాయకుడికి వీరభక్తుడు. ఆయన యుద్ధాలకు వెళ్లేటప్పుడల్లా ముందుగా ఈ త్రినేత్ర గణపతికి ప్రత్యేక పూజలు జరిపించి మరీ బయలుదేరేవాడట!
ఈ ఆలయానికి చేరుకోవాలంటే, కోటలో నిర్మించిన రెండువందల యాభై మెట్ల మీదుగా మెట్ల మార్గం ఉంది. కోట లోపలి వైపునే అర కిలోమీటరు కాలిబాట కూడా ఉంది. ఈ ఆలయంలో ఇక్కడి త్రినేత్ర గణపతి తన భార్యలు సిద్ధి, వృద్ధి; కొడుకులు శుభ లాభాలతో కలసి కొలువుదీరడం విశేషం. వినాయకుడు ఇలా సకుటుంబంగా కొలువుదీరిన ఏకైక ఆలయం ఇదొక్కటే!
కలువా వినాయకుడు
ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వినాయక ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో రూప్‌కుండ్– నందాదేవి పర్వతారోహక యాత్రకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ‘కలువా’ వినాయక ఆలయం లేదా ‘కేల్వా’ వినాయక ఆలయంగా పేరుపొందిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తున ఉంది.
మంచుకొండల్లో ఒక కొండ మీద ఉన్న ఈ ఆలయం చాలా చిన్నది. దీని ఎత్తు కేవలం అరడుగులు. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిక కోరికలు ఈడేరుతాయని భక్తులు నమ్ముతారు. పర్వతారోహకులు తప్ప సామాన్యులు ఈ ఆలయాన్ని సందర్శించడం దుస్సాధ్యం.
(చదవండి: గిన్నిస్‌లో గణపయ్య..)
బ్రొమో గణపతి
పురాతనమైన ఈ గణపతి విగ్రహం ఇండోనేసియాలో ఉంది. తూర్పు జావాలోని టెంగెర్ పర్వతాలకు చెందిన ‘బొమో’ అగ్నిపర్వత శిఖరంపై కొలువైన ఈ విగ్రహం ఏడు శతాబ్దాల నాటిది. ‘బ్రహ్మ’ను జావా హిందువులు స్థానిక భాషలో ‘బ్రొమో’ అంటారు. బ్రహ్మదేవుడి పేరిట ఈ అగ్నిపర్వతాన్ని ‘బ్రొమో’ అని పిలుచుకుంటారు.
జావాలోని టెంగెరీ తెగకు చెందిన వారు ఇక్కడ వినాయక విగ్రహాన్ని నెలకొల్పినట్లు చెబుతుంటారు. సముద్ర మట్టానికి ఏడువేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహానికి పూజలు చేసేందుకు జావా ప్రజలు పర్వతారోహణ చేస్తుంటారు. ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడతాడని జావా ప్రజల నమ్మకం.
(చదవండి: గిన్నిస్‌లో గణపయ్య..!)